Sexual Harassment : ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లాలో జరిగిన ఘోర ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఫకీర్ మోహన్ యూనివర్సిటీకి చెందిన ఇంటిగ్రేటెడ్ బీఈడీ రెండో సంవత్సరం విద్యార్థిని, లెక్చరర్ వేధింపులకు ఆవేదనతో కాలేజీ ప్రాంగణంలోనే నిప్పంటించుకొని మూడు రోజుల పాటు మృత్యువుతో పోరాడి, చివరికి ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాదకర ఘటనపై దేశ రాజకీయ వర్గాలు స్పందిస్తున్నాయి. ఈక్రమంలోనే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది సాధారణ ఆత్మహత్య కాదని, వ్యవస్థికమైన హత్యగా అభివర్ణించారు. బాధితురాలిని రక్షించడంలో ఒడిశా రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందంటూ ఆయన మంగళవారం తన అధికారిక సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు గుప్పించారు.
Read Also: DGCA : ఐదేళ్లలో 65 విమాన ఇంజిన్ వైఫల్యాలు..డీజీసీఏ నివేదిక..పలు కీలక విషయాలు వెల్లడి..!
ఒడిశాలో విద్యార్థిని ధైర్యంగా లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా గళం విప్పింది. కానీ ఆమెకు న్యాయం అందించాల్సిన స్ధానంలో, తానే నిందితురాలవుతుంది. బెదిరింపులు, అవమానాలు ఆమెను తలదించుకునేలా చేశాయి. చివరికి ఆమె ప్రాణాలకే విలువలేనని భావించి, కాలేజీ క్యాంపస్‌లోనే నిప్పంటించుకోవాల్సి వచ్చింది. ఇది నేరుగా ఆత్మహత్య కాదు.. ఈ దేశంలోని వ్యవస్థలు కలిసికట్టుగా చేసిన హత్య అని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ తన ట్వీట్‌లో ప్రధాన మంత్రి మోదీపై కూడా కఠినంగా మండిపడ్డారు. “మోదీజీ.. ఒడిశా అయినా, మణిపుర్ అయినా.. ఎక్కడ చూసినా కుమార్తెలు జ్వలిస్తున్నాయి. మీరు మౌనంగా ఉండటం ఏ విధంగా సమర్థించదగినది? దేశం మీ నిశ్శబ్దాన్ని ఇక సహించలేకపోతుంది. దేశ యువతులకు భద్రత, న్యాయం కావాలి” అంటూ రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
వాస్తవానికి, ఈ ఘటనకు నేపథ్యం ఎంతో హృదయవిదారకంగా ఉంది. బాధిత విద్యార్థిని కొన్ని రోజులుగా లెక్చరర్ సమీర్ సాహు లైంగిక వేధింపులకు గురవుతున్నట్టు సమాచారం. ఆమె మాట వినకుంటే చదువు, భవిష్యత్తు నాశనం చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. చివరకు జూన్ 30న కాలేజీ యాజమాన్యాన్ని ఆశ్రయించి ఫిర్యాదు చేసినా, స్పందన లేకపోవడంతో విద్యార్థిని తీవ్ర ఆత్మవేదనకు గురైంది. దీనికి నిరసనగా జూలై 12న కాలేజీ క్యాంపస్‌లో నిరసన ప్రదర్శన చేపట్టిన బాధితురాలు, అనూహ్యంగా ప్రిన్సిపల్ కార్యాలయానికి వెళ్లి అక్కడే తనపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంది. తోటి విద్యార్థులు వెంటనే ఆమెను ఆదుకునే ప్రయత్నం చేసినా, తీవ్ర గాయాలతో ఆమె ఆసుపత్రికి తరలించబడింది. అయితే చికిత్స పొందుతున్న ఆమె, జూలై 15 అర్ధరాత్రి నిశ్శబ్దంగా కన్నుమూసింది.
ఇక ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు, మహిళా హక్కుల సంఘాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితురాలికి న్యాయం జరగాలని గళం విప్పాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనపై విచారణ ప్రారంభించినట్టు తెలిపినా, బాధితురాలికి న్యాయం జరగడం ఎంతవరకు సాధ్యమవుతుందన్న దానిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక విద్యార్థిని తన భవిష్యత్తు, స్వాభిమానం కోసం గళం విప్పిన తీరుకు ఇలా ఘోర ముగింపు రావడం నిజంగా దేశ ప్రజలందరినీ కలచివేస్తోంది. ఇది ఒక్క బాధితురాలికి చెందిన విషాదకథే కాదు.. దేశం ఎదుర్కొంటున్న విఫలమైన విద్యా వ్యవస్థ, మహిళా రక్షణ వ్యవస్థలపై ప్రశ్నల వర్షాన్ని తెరలేపే ఉదంతం.
Read Also: Kerala Nurse Nimisha Priya: కేరళ నర్స్ నిమిషాకు బిగ్ రిలీఫ్.. ఉరిశిక్ష వాయిదా!