Site icon HashtagU Telugu

Parliament : ఈ బడ్జెట్‌ ప్రజల్లో కొత్త విశ్వాసం నింపుతుంది : ప్రధాని మోడీ

Delhi CM Swearing

Delhi CM Swearing

Parliament : ఈరోజు నుండి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. అనంతరం లోక్‌సభలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టనున్నారు. కాగా.. పార్లమెంటు సమావేశాలు ప్రారంభానికి ముందు పార్లమెంటు ఆవరణలో ప్రధాని నరేంద్ర మోడీ మీడియాతో మాట్లాడుతూ.. ఈ బడ్జెట్‌ ప్రజల్లో కొత్త విశ్వాసం నింపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పేదలు, సామాన్యులపై మహాలక్ష్మి కృప ఎప్పటికీ ఉండాలని ఆకాంక్షించారు. పార్లమెంట్‌ సమావేశాలు సజావుగా సాగేందుకు ప్రతిపక్షాలు సహకరిస్తాయని భావిస్తున్నట్లు చెప్పారు. మూడోసారి ఎన్డీయేకు ప్రజలు పట్టం కట్టారని.. పార్లమెంట్‌లో సంపూర్ణ బడ్జెట్‌ ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు.

ఈ బడ్జెట్‌ వికసిత్‌ భారత్‌కు ఊతం ఇస్తుందని పేర్కొన్నారు. వికసిత్‌ భారత్‌ లక్ష్యంతో పనిచేయాలని ప్రధాని మోడీ పేర్కొన్నారు. భారత శక్తి సామర్థ్యాలు మనకు విశేష గుర్తింపునిస్తాయన్నారు. ఈ బడ్జెట్‌ ప్రజల్లో కొత్త విశ్వాసం నింపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేలా బడ్జెట్‌ ఉంటుందన్నారు. అన్ని అంశాలపై సమగ్ర చర్చ జరిగేలా సభ్యులు సహకరించాలని, బిల్లులకు విపక్షాలు మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు.

కాగా, ఈ రోజు నుంచి ఫిబ్రవరి 13 వరకు తొలి విడత బడ్జెట్ సమావేశాలు జరుగనున్నాయి. తొలి విడతలో మొత్తం 9 రోజులపాటు బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నారు. అలాగే మలి విడత బడ్జెట్ సమావేశాలు మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వ తేదీ వరకు జరుగుతాయి. మలి విడతలో మొత్తం 18 రోజుల పాటు బడ్జెట్ సమావేశాల నిర్వహణ ఉంటుంది. రేపు (శనివారం) ఉదయం 11 గంటలకు లోకసభలో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. సోమవారం( ఫిబ్రవరి 3) ఉభయసభల్లోనూ రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం పై చర్చ జరుగనుంది.

Read Also: IND vs ENG 4th T20I: భార‌త్‌- ఇంగ్లాండ్ మ‌ధ్య నేడు నాలుగో టీ20.. ఈరోజు ముగిస్తారా?