ED Raids : తమిళనాడు ప్రభుత్వ ఆధ్వర్యంలో మద్యం విక్రయించే సంస్థ టాస్మాక్ పై ఇటీవల జరిగిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు తీవ్ర రాజకీయ చర్చలకు దారితీశాయి. కేంద్ర దర్యాప్తు సంస్థ చేపట్టిన దర్యాప్తుపై తాజాగా సుప్రీం కోర్టు తీవ్రంగా స్పందించింది. అన్ని హద్దులు దాటి, సమాఖ్య పాలన భావనను ఉల్లంఘిస్తూ వ్యవహరిస్తోందని కోర్టు ఈడీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పరిణామాల్లో భాగంగా, సుప్రీం కోర్టు టాస్మాక్‌పై జరుగుతున్న మనీలాండరింగ్ దర్యాప్తుపై తాత్కాలికంగా స్టే విధించింది. ఇదే సమయంలో దర్యాప్తు అధికారుల తీరుపై తీవ్రంగా ఆక్షేపించింది. “ఒక ప్రభుత్వ సంస్థపై విచారణ పేరుతో ఈడీ అధికారుల దాడులు అన్యాయంగా మారాయి. కేంద్ర సంస్థలు హద్దులు దాటి వ్యవహరించడాన్ని మేము సహించం” అని ధర్మాసనం స్పష్టం చేసింది.
Read Also: YS Jagan : కూటమి సర్కారుపై వైఎస్ జగన్ ప్రోగ్రెస్ రిపోర్ట్..!
ఈడీ వేసిన ఆరోపణల ప్రకారం, టాస్మాక్‌లో దాదాపు రూ.1000 కోట్ల మేర అవకతవకలు చోటుచేసుకున్నాయని భావిస్తోంది. దీనికి సంబంధించి ఈ ఏడాది మార్చిలో టాస్మాక్ ప్రధాన కార్యాలయంలో సోదాలు నిర్వహించగా, మే నెల ప్రారంభంలో టాస్మాక్ అధికారుల ఇళ్లపై కూడా తనిఖీలు జరిపింది. ఈ కేసులో, రాష్ట్ర పోలీసులు మరియు అవినీతి నిరోధక శాఖ (DVAC) నమోదు చేసిన కేసుల ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించింది. ఈ పరిణామాలను తీవ్రంగా తీసుకున్న తమిళనాడు ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. టాస్మాక్‌పై ఈడీ దాడులు తమ అనుమతి లేకుండా జరుగుతున్నాయనీ, అధికారులపై దౌర్జన్యంగా వ్యవహరిస్తోందని తమిళనాడు ప్రభుత్వం ఆరోపించింది. అయితే, హైకోర్టు ఈ పిటిషన్‌ను కొట్టివేస్తూ, ఈడీ దర్యాప్తును కొనసాగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీన్ని వ్యతిరేకిస్తూ తమిళనాడు ప్రభుత్వం, టాస్మాక్ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.
తాజాగా జరిగిన విచారణలో సుప్రీం కోర్టు ఈడీ దాడుల తీరును తీవ్రంగా విమర్శించింది. విచారణ పేరుతో హద్దులు దాటడాన్ని ఖండించింది. ఈ పిటిషన్‌పై సమగ్ర వివరణ ఇవ్వాలని ఈడీకి నోటీసులు జారీ చేసింది. సుప్రీం తీర్పును స్వాగతించిన డీఎంకే (DMK) పార్టీ, ఇది బీజేపీ కుట్రలకు గట్టి సమాధానం అని పేర్కొంది. తమిళనాడు ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కేంద్రం కావాలనే ఈ దాడులను ప్రేరేపించిందని ఆరోపించింది. డీఎంకే కార్యదర్శి ఆర్‌ఎస్ భారతి మాట్లాడుతూ, “కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ రాజకీయ పరమైన పద్ధతిలో వాడుకుంటోంది. ప్రజా నిర్ణయాన్ని గౌరవించకుండా, బీజేపీ తరపున కేంద్రం స్వీయ అధికారాలను దుర్వినియోగం చేస్తోంది” అన్నారు. ఈ పరిణామాలన్నీ తమిళనాడులో రాజకీయ ఉధృతిని పెంచుతున్నాయి. కేంద్ర-రాష్ట్ర సంబంధాలపై మళ్లీ చర్చ మొదలయ్యేలా చేశాయి. టాస్మాక్ అంశం మరోసారి కేంద్ర దళాల జోక్యంపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది. ఈ కేసు పైన తుది తీర్పు ఎలా ఉండబోతుందో అన్నది ఇక రాజకీయంగా, న్యాయపరంగా అత్యంత కీలక అంశంగా మారింది.