Nimisha Priya : ఆ ఉరిశిక్ష విషయంలో భారత్‌ చేయగలిగిందేమీ లేదు: సుప్రీంకోర్టుకు కేంద్రం వెల్లడి

బ్లడ్‌ మనీ చెల్లింపు ప్రైవేట్‌ స్థాయిలో మాత్రమే చర్చించబడుతోంది. ప్రభుత్వం చేసేదేమీ లేదు అని ఆయన స్పష్టం చేశారు. ఈ పరిణామాలపై న్యాయమూర్తి జస్టిస్‌ సందీప్‌ మెహతా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ ఘటన చాలా కలవరపరిచే విధంగా ఉంది. నిమిష ప్రాణాలు కోల్పోతే అది మానవీయంగా బాధాకరమైన విషయం అవుతుంది అని వ్యాఖ్యానించారు.

Published By: HashtagU Telugu Desk
There was nothing India could have done about the death penalty: Centre tells Supreme Court

There was nothing India could have done about the death penalty: Centre tells Supreme Court

Nimisha Priya : కేరళకు చెందిన నర్సు నిమిష ప్రియకు యెమెన్‌లో విధించిన ఉరిశిక్షను నిలిపివేయడం భారత ప్రభుత్వం ఆధీనంలో లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ విషయాన్ని సోమవారం సుప్రీం కోర్టుకు అడ్వకేట్‌ జనరల్‌ ఆర్‌. వెంకటరమణి తెలిపారు. భారత్‌కు యెమెన్‌తో ఎటువంటి దౌత్య సంబంధాలు లేవు. ప్రాసిక్యూటర్‌కు ఉరిశిక్షను వాయిదా వేయగలమా అనే విషయంపై లేఖ రాసినప్పటికీ, ప్రస్తుతం పెద్దగా మార్గాలు మిగలలేదు. బ్లడ్‌ మనీ చెల్లింపు ప్రైవేట్‌ స్థాయిలో మాత్రమే చర్చించబడుతోంది. ప్రభుత్వం చేసేదేమీ లేదు అని ఆయన స్పష్టం చేశారు. ఈ పరిణామాలపై న్యాయమూర్తి జస్టిస్‌ సందీప్‌ మెహతా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ ఘటన చాలా కలవరపరిచే విధంగా ఉంది. నిమిష ప్రాణాలు కోల్పోతే అది మానవీయంగా బాధాకరమైన విషయం అవుతుంది అని వ్యాఖ్యానించారు.

Read Also: Ashok Gajapathi Raju: గోవా గ‌వ‌ర్న‌ర్‌గా టీడీపీ సీనియ‌ర్ నేత‌ అశోక్ గ‌జ‌ప‌తి రాజు!

ఇక, జూలై 16న నిమిష ప్రియకు ఉరిశిక్ష అమలయ్యే అవకాశం ఉండటంతో, ఆమె కుటుంబ సభ్యులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 10వ తేదీన దాఖలైన పిటిషన్‌ను ధర్మాసనం విచారించేందుకు అంగీకరించి, విచారణను వాయిదా వేసింది. నిమిష ప్రియ ప్రాణాలను కాపాడేందుకు కేరళ ముఖ్యమంత్రి పినరయ్‌ విజయన్‌ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాసి, ఈ విషయంలో జోక్యం చేసుకొని నిమిషను విడిపించాలని కోరారు. విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌కు కూడా ఈ లేఖను పంపారు. కాగా, 2008లో నర్సింగ్‌ కోర్సు పూర్తి చేసిన నిమిష యెమెన్‌ వెళ్లి ఉద్యోగం సాధించింది. 2011లో కేరళకు వచ్చి థామస్‌ అనే వ్యక్తిని వివాహం చేసుకొని మళ్లీ యెమెన్‌ వెళ్లింది. అక్కడ తన క్లినిక్‌ ప్రారంభించాలనుకున్న నిమిష, వ్యాపార భాగస్వామిగా తలాల్‌ అదిబ్‌ మెహదిని తీసుకుంది. ‘‘అల్‌అమన్‌ మెడికల్‌ కౌన్సిల్‌ సెంటర్‌’’ పేరుతో వ్యాపారం ప్రారంభించారు. అయితే, తర్వాత పరిస్థితులు మారిపోయాయి. నిమిష కుటుంబం ప్రకారం, మెహది ఆమెను వేధించాడని, డబ్బు లాక్కొన్నాడని, ఆమెను తన భార్యగా పరిచయం చేస్తూ పాస్‌పోర్ట్‌, ఇతర పత్రాలు లాక్కొన్నాడని ఆరోపణలు ఉన్నాయి.

ఆమె కుటుంబసభ్యులతో మాట్లాడకూడదని చెబుతూ పూర్తిగా వేరిచేసాడట. 2016లో ఫిర్యాదు చేసినా యెమెన్‌ పోలీసుల నుంచి స్పందన రాలేదట. ఈ పరిస్థితుల్లో 2017లో నిమిష ప్రియ, మెహదికి మత్తుమందు ఇచ్చి తన పాస్‌పోర్టును తిరిగి తీసుకోవాలని ప్రయత్నించింది. కానీ మత్తుమందు మోతాదు అధికంగా ఉండటంతో అతడు అక్కడికక్కడే మరణించాడు. ఆ తర్వాత మృతదేహాన్ని ఓ వాటర్‌ ట్యాంక్‌లో పారేసిన ఆమె, సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయత్నంలో అరెస్టు అయ్యింది. యెమెన్‌ చట్టాల ప్రకారం, మృతుని కుటుంబానికి పరిహారం చెల్లిస్తే ఉరిశిక్షను రద్దు చేసే అవకాశం ఉంది. దీంతో నిమిష కుటుంబం సుమారు 1 మిలియన్‌ డాలర్లు (రూ.8.6 కోట్లు) ఇవ్వడానికి సిద్ధమైంది. కానీ, ఇప్పటి వరకు మృతుడి కుటుంబం నుంచి స్పందన రాలేదని సామాజిక కార్యకర్త బాబుజాన్‌ వెల్లడించారు. ఈ పరిస్థితుల్లో నిమిష ప్రియ ప్రాణాలను కాపాడేందుకు కేంద్రం వెంటనే స్పందించాలని, అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థల ద్వారా దౌత్యమార్గాలు అన్వేషించాలని నిపుణులు సూచిస్తున్నారు.

Read Also: Nara Lokesh : వంద రోజుల చాలెంజ్..మంగళగిరిలో గుంతలు లేని రోడ్డు: మంత్రి లోకేశ్‌

 

  Last Updated: 14 Jul 2025, 02:47 PM IST