Tariffs : వాషింగ్టన్-న్యూఢిల్లీ మధ్య వాణిజ్య సంబంధాల్లో కొత్త మలుపు తలెత్తింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై దిగుమతి సుంకాలను పెంచుతున్నట్లు ప్రకటించగా, భారత ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం గట్టిగా స్పందించారు. రైతుల సంక్షేమానికి మద్దతుగా నిలబడి రైతుల ప్రయోజనాలపై ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడబోము అని స్పష్టంచేశారు. అమెరికా డెయిరీ ఉత్పత్తులను దిగుమతులకు భారత్ గతంలో అనుమతి ఇవ్వకపోవడమే ఈ పరిణామాలకు మూలంగా చెబుతున్నారు. అమెరికా డెయిరీ పరిశ్రమకు భారీగా లాభాలు చేకూరేలా, తమ ఉత్పత్తులను భారత్‌లో ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించింది. అయితే, వాటి దిగుమతులు భారత దేశీయ రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తాయనే కారణంతో భారత ప్రభుత్వం అవి నిరాకరించింది.
Read Also: United Airlines : అమెరికా వ్యాప్తంగా విమానాలు నిలిపివేత..ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం
ఈ నేపధ్యంలో ట్రంప్ ప్రభుత్వం భారత్‌పై విరుచుకుపడుతోంది. రష్యా చమురును కొనుగోలు చేస్తున్నారన్న కారణంతోనూ భారతంపై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు భారత దిగుమతులపై అమలులో ఉన్న 25 శాతం టారిఫ్‌ను, ట్రంప్ 50 శాతానికి పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ పరిణామాల నేపథ్యంలో నరేంద్ర మోడీ వాణిజ్యమంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో సమావేశమై సమీక్ష నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ..రైతుల సంక్షేమం మా ప్రభుత్వానికి అత్యున్నత ప్రాధాన్యత. దేశంలోని దాదాపు 60 శాతం జనాభా వ్యవసాయంపై ఆధారపడుతోంది. వారి ప్రయోజనాల కోసం ఏదైనా ఒప్పందాన్ని త్యజించడానికైనా సిద్ధంగా ఉన్నాం. కానీ, రైతుల జీవితాలపై ప్రమాదం వచ్చే విధంగా ఎలాంటి విదేశీ ఒత్తిడికీ లోనయ్యే ప్రసక్తే లేదు అని తేల్చిచెప్పారు.
ఇది ప్రత్యక్షంగా ట్రంప్ పేరు ప్రస్తావించకుండా చేసిన వ్యాఖ్య అయినా, నేపథ్యం దృష్ట్యా ఇది అమెరికాపైనే ప్రధాని పరోక్ష ప్రతిస్పందనగా చెబుతున్నారు నిపుణులు. అంతర్జాతీయ వాణిజ్యంలో స్వార్థపూరితంగా వ్యవహరించే దేశాలకు భారత్ తలవంచే ప్రసక్తే లేదని ప్రధాని ఈ వ్యాఖ్యల ద్వారా సంకేతం పంపించారు. ఇదిలా ఉండగా, అమెరికా టారిఫ్ పెంపు నిర్ణయం భారత దిగుమతిదారులను తీవ్రంగా ప్రభావితం చేయనుంది. అమెరికా నుంచి దిగుమతి అయ్యే పరికరాలు, ఆయిల్ ఉత్పత్తులు, మైదానం సంబంధించిన పరికరాలపై వ్యయం పెరగనుంది. దీని ప్రభావం ఖచ్చితంగా దేశీయ మార్కెట్‌పై పడనుంది. ఈ నేపథ్యంలో భారత్ తన స్వావలంబన విధానాన్ని మరింత బలపరచే దిశగా అడుగులు వేయనుందని స్పష్టమవుతోంది. దేశీయ పరిశ్రమలను, వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
కాగా, రష్యా నుంచి చమురు కొనుగోలును కొనసాగిస్తున్న భారత్‌పై అమెరికా కఠిన వైఖరి అవలంబించింది. భారతదేశం నుంచి వచ్చే దిగుమతులపై అదనంగా 25 శాతం టారిఫ్ (సుంకం) విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం ఒక కార్యనిర్వాహక ఉత్తర్వుపై (ఎగ్జిక్యూటివ్ ఆర్డర్) సంతకం చేశారు. గత వారం ప్రకటించిన 25 శాతం సుంకానికి ఇది అదనం కావడం గమనార్హం. ఈ కొత్త సుంకాలు ఉత్తర్వుపై సంతకం చేసిన 21 రోజుల తర్వాత అమెరికాలోకి ప్రవేశించే అన్ని అర్హత కలిగిన భారతీయ వస్తువులపై అమల్లోకి వస్తాయి. అయితే, ఈ గడువుకు ముందే రవాణాలో ఉండి, సెప్టెంబర్ 17వ తేదీలోపు కస్టమ్స్ క్లియరెన్స్ పొందే సరుకులకు ఈ నిబంధనల నుంచి మినహాయింపు కల్పించారు. ఇప్పటికే ఉన్న సుంకాలను యథాతథంగా కొనసాగిస్తూ, ఈ కొత్త టారిఫ్‌లను అదనంగా విధించనున్నారు.