Maha Kumbha Mela : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మంగళవారం లోక్‌సభలో ప్రధాని మోడీ ప్రసంగించారు. ఈ సందర్భంగా కుంభమేళాను విజయవంతం చేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయం అందరి కృషి ఫలితం అని మోడీ అన్నారు. భారత్ గొప్పతనాన్ని ప్రపంచం మొత్తం చూసిందని అన్నారు. గతేడాది శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా దేశం మొత్తం ఎలా పులకించిపోయిందో చూశాం. కుంభమేళాలోను అలాంటి ఐక్యతే కనిపించింది. మహా కుంభ్‌లో జాతీయ మేల్కొలుపును మనం చూశాం. ఇది కొత్త విజయాలకు ప్రేరణనిస్తుంది. మన సామర్థ్యంపై ఉన్న అనుమానాలను కుంభమేళా పటాపంచలు చేసిందని ప్రధాని అన్నారు.
Read Also: Jinping Vs Army : జిన్‌పింగ్‌పై తిరుగుబాటుకు యత్నించారా ? కీలక ఆర్మీ అధికారులు అరెస్ట్
ఇది దేశ ప్రజల విజయం. కుంభమేళా ప్రజల్లో ఆధ్యాత్మిక స్ఫూర్తిని పెంచింది. ఈ చారిత్రాత్మక ఘట్టం భవిష్యత్తు తరాలకు ఉదాహరణగా నిలుస్తుంది అని ప్రధాని మోడీ పేర్కొన్నారు. కుంభమేళాలో భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు ఆవిష్కృతమయ్యాయి. మన బలాన్ని అవమానించే వారికి ఈ కార్యక్రమం తగిన సమాధానం ఇచ్చింది. ఇక భారత సంప్రదాయాలను కొత్తతరం గౌరవంతో స్వీకరిస్తోంది అని మోడీ మాట్లాడారు. ఈ ప్రసంగంపై ప్రశ్నలు వేయడానికి అనుమతి లభించకపోవడంతో విపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తంచేశాయి. దాంతో సభ వాయిదా పడింది.
కాగా, ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా జనవరి 13న మొదలుకాగా.. ఫిబ్రవరి 26 వరకు కొనసాగింది. కోట్లాదిమంది త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. ప్రయాగ్‌రాజ్‌లో 45 రోజులపాటూ సాగిన ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారని మోడీ తెలిపారు. రాజకీయ, సినీ, వ్యాపార, విదేశీ ప్రముఖులు ఈ కుంభమేళాకు హాజరైనట్లు చెప్పారు. కుంభమేళా నీళ్లను తాను మారిషన్‌కి కూడా తీసుకెళ్లినట్లు ప్రధాని చెప్పారు. ప్రయాగ్‌రాజ్‌లోని గంగ, యమున, సర్వతి నదులు కలిసే పవిత్ర త్రివేణీ సంగమంలో 66 కోట్ల మంది పుణ్యస్నానాలు చేసినట్లు వెల్లడించారు.