Uttarakhand – UCC : యూసీసీ డ్రాఫ్ట్‌కు ఉత్తరాఖండ్ మంత్రివర్గం పచ్చజెండా.. 6న అసెంబ్లీకి బిల్లు!

Uttarakhand - UCC :  యూనిఫామ్ సివిల్ కోడ్‌(యూసీసీ)పై ఐదుగురు సభ్యుల  నిపుణుల కమిటీ రూపొందించిన ముసాయిదా బిల్లుకు ఉత్తరాఖండ్‌ మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

Published By: HashtagU Telugu Desk
Ucc Uttarakhand

Ucc Uttarakhand

Uttarakhand – UCC :  యూనిఫామ్ సివిల్ కోడ్‌(యూసీసీ)పై ఐదుగురు సభ్యుల  నిపుణుల కమిటీ రూపొందించిన ముసాయిదా బిల్లుకు ఉత్తరాఖండ్‌ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామీ అధ్యక్షతన నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ రంజనా ప్రకాశ్‌ దేశాయ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కమిటీ ఈ డ్రాఫ్ట్‌ను రూపొందించింది. దీనికి సంబంధించిన తుది ప్రతిని గత శుక్రవారమే ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వానికి కమిటీ సభ్యులు సమర్పించారు. యూసీసీపై చట్టం చేయడానికి సోమవారం నుంచి శాసనసభ నాలుగు రోజుల పాటు భేటీ కానుంది. ఈ  ముసాయిదాకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం లభించడంతో అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు లైన్ క్లియర్ అయింది. ఫిబ్రవరి 6 ఈ బిల్లును ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. డెహ్రాడూన్‌లో సీఎం ధామి అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ చట్టం అమలైతే.. స్వాతంత్య్రం తర్వాత యూసీసీ(Uttarakhand – UCC) తెచ్చిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్‌  నిలువనుంది.

We’re now on WhatsApp. Click to Join

యూసీసీ ముసాయిదా బిల్లులోని అంశాలివీ.. 

  • మహిళలు, పురుషులకు సమానమైన వారసత్వ హక్కులను కల్పించడం.
  • వివాహాల రిజిస్ట్రేషన్‌‌ను తప్పనిసరి చేయడం. వివాహ రిజిస్ట్రేషన్‌ చేసుకోని జంటలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సౌకర్యాలు లభించవు.
  • పెళ్లిళ్ల నమోదుకు గ్రామాల స్థాయిలోనూ ఏర్పాట్లు చేస్తారు.
  • అమ్మాయిలకు వివాహ వయసును పెంచనున్నారు. దీనివల్ల  గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసే యువతుల సంఖ్య పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
  • దత్తత హక్కులు ప్రతి ఒక్కరికీ ఉంటాయి. ముస్లిం మహిళలకూ ఇవి వర్తిస్తాయి. దత్తత ప్రక్రియనూ సరళీకరిస్తారు.
  • అన్ని వర్గాల్లో బహు  భార్యత్వం, బాల్య వివాహాలపై నిషేధం విధిస్తారు.
  • అన్ని మతాలకు చెందిన అమ్మాయిలకు ఒకే విధమైన కనీస వివాహ వయసు ఉంటుంది.
  • విడాకులకు సంబంధించి అన్ని మతాలవారికి ఒకే తరహా నిబంధనలు ఉంటాయి.
  • హలాల్‌, ఇద్దత్‌ పద్ధతులపై నిషేధం విధిస్తారు.
  • సహజీవనం సాగిస్తున్నవారు దానిపై డిక్లరేషన్‌ తప్పనిసరిగా ప్రభుత్వానికి అందించాలి.
  • అన్ని వర్గాలవారు కోర్టుల ద్వారానే విడాకులను పొందాలి.
  • తల్లిదండ్రుల మధ్య వివాదం నడుస్తుంటే వారి పిల్లలను అమ్మమ్మ/ నానమ్మ, తాతయ్యలకు అప్పగిస్తారు.
  • కుటుంబంలో సంపాదించే వ్యక్తి మరణిస్తే.. భార్యకు అందే పరిహారంలో మృతుడి తల్లిదండ్రులకూ వాటా ఉంటుంది. ఒకవేళ భార్య మరో వివాహం చేసుకున్నా.. మొదటి భర్త మరణం వల్ల అందే పరిహారాన్ని అతడి తల్లిదండ్రులకు వాటా ఇవ్వాలి. ఒకవేళ భార్య చనిపోతే ఆమె తల్లిదండ్రులను చూసుకునేవారు లేకపోతే భర్తే ఆ బాధ్యతను తీసుకోవాలి.
  • ఉత్తరాఖండ్ జనాభాలోని 3 శాతం మంది ఎస్టీలను యూసీసీ పరిధి నుంచి మినహాయిస్తారు.
  • యూసీసీ ముసాయిదా బిల్లులోని పై నిబంధనలలో  మార్పులు, చేర్పులు జరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

Also Read : Gadala Politics : ఉద్యోగానికి గడల రాజీనామా.. కాంగ్రెస్ లోక్‌సభ టికెట్‌కు అప్లై చేశానని వెల్లడి

  Last Updated: 05 Feb 2024, 12:32 AM IST