Indian Army : కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చట్టవిరుద్ధమైన ఆన్‌లైన్ పోస్టుల తొలగింపుపై సోషల్ మీడియా కంపెనీలకు నేరుగా నోటీసులు పంపగల ‘నోడల్ అధికారి’గా భారత సైన్యంలోని వ్యూహాత్మక కమ్యూనికేషన్ విభాగం అదనపు డైరెక్టర్ జనరల్ (ADG)ను భారత రక్షణ శాఖ నోటిఫై చేసింది. సమాచార సాంకేతిక (ఐటీ) చట్టంలోని సెక్షన్ 79(3)(బి) ప్రకారం.. భారత సైన్యం(Indian Army), దాని అనుబంధ విభాగాలకు సంబంధించిన కంటెంట్‌ను ‘వ్యూహాత్మక కమ్యూనికేషన్ విభాగం’ పర్యవేక్షిస్తుంది.
Also Read :Ravanas Clan : గడ్చిరోలిలో రావణుడి వంశీకులు.. దీపావళి రోజు ఏం చేస్తారంటే..?
ఏదైనా చట్టవిరుద్ధమైన కంటెంట్ ఉందని గుర్తించిన వెంటనే ఇకపై నేరుగా ఆ విభాగం ఏడీజీ నుంచి సోషల్ మీడియా కంపెనీకి నోటీసులు వెళ్తాయి. సదరు సోషల్ మీడియా కంపెనీ నుంచి నేరుగా ఏడీజీకి వివరణ అందుతుంది. ఇంతకుముందు వరకు భారత సైన్యానికి చెందిన కమ్యూనికేషన్ విభాగం ఏదైనా చట్టవిరుద్ధమైన కంటెంటును గుర్తించినప్పుడు.. దానిపై కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖకు సమాచారాన్ని అందజేసేది. ఇకపై ఆ అవసరం ఉండబోదు. నేరుగా సోషల్ మీడియా కంపెనీలతో సంప్రదించేందుకు భారత సైన్యం కమ్యూనికేషన్ విభాగానికి అవకాశం ఇవ్వడంతో ఎంతో సమయం కూడా ఆదా అవుతుంది. సత్వరంగా సోషల్ మీడియా కంపెనీలను ఆర్మీ సంప్రదించేందుకు వెసులుబాటు కలుగుతుంది.
Also Read :Anakapalle : అనకాపల్లి జిల్లాలో ‘ఆర్సెలార్ మిట్టల్ – నిప్పన్ స్టీల్స్’ ప్లాంట్.. తొలి దశలో రూ.70వేల కోట్ల పెట్టుబడి
ప్రత్యేకించి పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లతో రెచ్చిపోతోంది. మన దేశంలోని ప్రజలను ట్రాప్ చేసి.. వారి ద్వారా రక్షణ రంగ సమాచారం, సైనిక స్థావరాల వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. అటువంటి ట్రాపింగ్ వ్యవహారాలను ఎప్పటికప్పుడు బయటపెట్టేందుకు, అలాంటి అవాంఛిత అకౌంట్లను బ్లాక్ చేయించేందుకు తాజా నిర్ణయంతో బాటలు పడనున్నాయి. ఆర్మీ కమ్యూనికేషన్ విభాగం మరింత బలోపేతమైంది.