Lok Sabha Session : 18వ లోక్‌సభ మొదటి సెషన్ ఇవాళ కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. జులై 3 వరకు ఈ సెషన్ కొనసాగనుంది. ఇవాళ ఉదయాన్నే ప్రొటెం స్పీకర్‌గా భర్తృహరి చేత రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రమాణం చేయించనున్నారు. అనంతరం ఆయన లోక్‌సభకు(Lok Sabha Session) చేరుకొని ఉదయం 11 గంటలకు సభా కార్యకలాపాలు ప్రారంభిస్తారు. తొలుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భర్తృహరి ప్రమాణం చేయిస్తారు. అనంతరం తనకు సహయకులుగా రాష్ట్రపతి నియమించిన ప్యానల్ ఆఫ్ ఛైర్‌పర్సన్‌లతో భర్తృహరి ప్రమాణం చేయిస్తారు.ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొత్త ఎంపీల ప్రమాణ స్వీకారాలు కొనసాగుతాయి. గంటకు 26 మంది చొప్పున ఎంపీలు ప్రమాణం చేసేలా షెడ్యూల్ ఖరారు చేశారు. ఇవాళ 280 మంది ఎంపీలు, రేపు మిగతా ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
We’re now on WhatsApp. Click to Join
కేంద్ర మంత్రుల ప్రమాణ స్వీకారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో మొదలవుతుంది. తొలుత కేబినెట్, తర్వాత స్వతంత్ర హోదా సహాయ మంత్రులు, ఆ తర్వాత సహాయ మంత్రులుగా ఉన్న లోక్‌సభ సభ్యులు ప్రమాణం పూర్తి చేస్తారు. తదుపరిగా కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్రాలకు చెందిన సభ్యులను అక్షర క్రమంలో పిలుస్తారు. సాధారణ సభ్యుల్లో అండమాన్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ సభ్యుడు బిష్ణుపద రే తొలుత ప్రమాణం చేస్తారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ సభ్యుల ప్రమాణ క్రమం అరకు ఎంపీతో మొదలై చిత్తూరుతో పూర్తవుతుంది. తెలంగాణ సభ్యుల ప్రమాణాలు ఆదిలాబాద్‌తో మొదలై ఖమ్మంతో ముగుస్తాయి. చిట్టచివరన బెంగాల్‌కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ బీర్‌భూమ్ శతాబ్దిరాయ్‌తో ప్రమాణ స్వీకారాల ప్రక్రియ ముగుస్తుంది.
Also Read :Terrorist Attack : రష్యాలోని ప్రార్థనా మందిరాలపై ఉగ్రదాడి.. 15 మంది మృతి
ఎంపీల ప్రమాణాలు పూర్తయిన తర్వాత స్పీకర్ ఎన్నికకు నామినేషన్ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈనెల 26న స్పీకర్ ఎన్నిక పూర్తవుతుంది. 27న పార్లమెంటు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. అనంతరం ఆమె ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతుంది. తదుపరిగా లోక్‌సభ సమావేశాలు వాయిదా వేస్తారు. వర్షాకాల పార్లమెంటు సమావేశాలు జులై 22 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అందులో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లానే మరోసారి కొనసాగించాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు బిర్లాకు సంకేతం కూడా అందినట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే జరిగితే బలరాం జాఖడ్ తర్వాత వరుసగా రెండోసారి లోక్‌సభ స్పీకర్‌గా వ్యవహరించిన వ్యక్తిగా ఓంబిర్లా రికార్డును సాధిస్తారు.
స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవుల కోసం..
ప్రస్తుత లోక్‌సభలో ఎన్డీయే కూటమికి 293 మంది సభ్యులు, ఇండియా కూటమికి 234 మంది సభ్యులు ఉన్నారు. ఇరు పక్షాలకు ఉన్న సంఖ్యాబలాన్ని బట్టి అధికారపక్షం స్పీకర్ స్థానాన్ని తీసుకుంటే.. డిప్యూటీ స్పీకర్ పదవిని తమకు ఇవ్వాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. లేదంటే స్పీకర్ స్థానానికి తమ తరఫున అభ్యర్థిని రంగంలోకి దింపుతామని అంటున్నాయి. డిప్యూటీ స్పీకర్ పదవిని విపక్ష ఇండియా కూటమికి ఇచ్చేందుకు అధికార ఎన్డీయే కూటమి నిరాకరిస్తే.. స్పీకర్ పదవికి ఎన్నిక అనివార్యమయ్యే అవకాశం ఉంది.