Hyperloop Track : బుల్లెట్ రైలు గంటకు 450 కి.మీ వేగంతో నడుస్తుంది. హైపర్‌లూప్‌లోని రైళ్లు ఏకంగా గంటకు 1100 కిలోమీటర్ల వేగంతో నడుస్తాయి. ఇప్పుడు దేశంలోనే తొలి హైపర్‌లూప్ టెస్ట్ ట్రాక్ పూర్తిగా రెడీ అయింది. దీన్ని ఐఐటీ మద్రాస్ తయారు చేసింది. ఈ ట్రాక్ పొడవు 410 మీటర్లు. దీన్ని ఐఐటీ మద్రాస్ క్యాంపస్‌లోనే నిర్మించారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి భారత రైల్వేశాఖ ఆర్థిక సహాయం అందించింది. ఐఐటీ మద్రాస్ విద్యార్థులు ‘ఆవిష్కార్ హైపర్‌లూప్’ పేరుతో ఒక బృందంగా ఏర్పడి ఈ హైపర్ లూప్ ట్రాక్‌ను తయారు చేశారు. ఇందులో 11 కోర్సులకు చెందిన 76 మంది అండర్ గ్రాడ్యుయేట్లు, పీజీ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ హైపర్‌లూప్ ట్రాక్‌పై త్వరలో ట్రయల్ రన్‌లు ప్రారంభమవుతాయి. ఈ ట్రయల్స్ సక్సెస్ అయితే ఈ అత్యాధునిక ప్రజా రవాణా వ్యవస్థను మనదేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున వినియోగంలోకి తీసుకురావచ్చు.
‘హైపర్ లూప్’ అంటే ఏమిటి ?
‘హైపర్ లూప్’(Hyperloop Track) అంటే ప్రత్యేకమైన వాక్యూమ్ ట్యూబ్. ఈ ట్యూబ్‌లో ప్రత్యేకమైన రైల్వే ట్రాక్ ఉంటుంది. ‘‘హైపర్‌లూప్ ట్యూబ్‌లోని ‘లూప్’ అంటే అత్యల్ప గాలి పీడనంతో కూడిన ట్యూబ్. పాడ్ అనే మరో భాగం కూడా ఇందులో ఉంటుంది. ఇది రైలు బోగీ లాంటి వాహనం. టెర్మినల్ అంటే హైపర్‌లూప్ బోగీలు ఆగే ప్రదేశం. హైపర్ లూప్ ట్రాక్‌పై నుంచి అధిక వేగంతో రైలు దూసుకుపోతుంది. దీనివల్ల ఎలాంటి ట్రాఫిక్ అంతరాయాలు లేకుండా రైళ్లను నడిపే అవకాశం కలుగుతుంది. ఫలితంగా ప్రయాణికులకు ఎంతో సమయం ఆదా అవుతుంది. రైలు వేగం పెరుగుతుంది. అతి తక్కువ సమయంలోనే గమ్యస్థానాన్ని చేరుకోవచ్చు. ఢిల్లీ నుంచి ముంబైకి, ముంబై నుంచి పూణేకు, హైదరాబాద్ నుంచి విజయవాడకు కేవలం అరగంటలోనే మనం చేరుకోవచ్చు.
Also Read :Top 10 Tourist Places: దేశంలోని టాప్ -10 టూరిస్టు ప్రదేశాల్లో హైదరాబాద్ హవా
రైల్వేశాఖ ట్వీట్
వాక్యూమ్ ట్యూబ్‌లో ప్రయాణం జరగడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా తగ్గిపోతాయి. ఈ వాక్యూమ్ ట్యూబ్‌లోని రైలులో ప్రయాణించే వారి కోసం ఆక్సిజన్ వసతి, వెంటిలేషన్ సౌకర్యం ఉంటాయి. కాబట్టి ఇందులో సేఫ్‌గా ప్రయాణించొచ్చు. దేశంలోనే తొలి హైపర్‌లూప్ టెస్ట్ ట్రాక్ వీడియోను తాజాగా భారతదేశ రైల్వే మంత్రిత్వ శాఖ ఎక్స్ వేదికగా విడుదల చేసింది.