Budget 2026 -27 : పక్కలో బల్లెంలా మారిన పొరుగుదేశం చైనాకు బిగ్ షాక్ తగిలింది. వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలను సభలో ప్రవేశపెడుతున్న వేళ.. తన ఉపన్యాసం ప్రారంభంలోనే సంచలన విషయాన్ని వెల్లడించారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్. ఓ భారీ ప్రాజెక్ట్ ను ప్రకటించారు. దీనివల్ల చైనపై ఆధార పడాల్సిన అవసరం భారత్ కు ఏమాత్రం కూడా ఉండబోదు. ఫలితంగా- కొద్దో గొప్పో ఆ దేశ ఆర్థిక రంగానికి భారత్ అందిస్తోన్న సహకారానికి చెక్ పడినట్టవుతుంది.
దేశంలో సెమీకండక్టర్ రంగాన్ని పటిష్టం చేసేందుకు నిర్మల సీతారామన్ కీలక ప్రతిపాదనలను ప్రకటించారు. ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ISM) 2.0 ను ప్రారంభించినట్లు వెల్లడించారు. తొలి దశ విజయవంతమైన నేపథ్యంలో- ఇక దేశీయ సెమీకండక్టర్ వ్యవస్థను బలోపేతం చేయడమే ఈ మిషన్ ప్రధాన ఉద్దేశమని వివరించారు. దీనివల్ల చిప్, సెమీకండక్టర్లను చైనా సహా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవడం తగ్గుతుంది.
ఈ సెమీకండక్టర్ మిషన్ 2.0 అసెంబ్లింగ్ నుండి పరిశోధనల వైపు దృష్టి సారిస్తుందని తెలిపారు. దీన్ని మరింత విస్తరించాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. దీనికోసం బడ్జెట్ లో 40,000 కోట్ల రూపాయలను కేటాయించినట్లు వివరించారు. దీన్ని- సెమీకండక్టర్ పరికరాలు, ఉత్పత్తి నుండి స్వదేశీ ఐపీ డిజైన్‌తో పాటు 45 కీలక సప్లై చైన్ ల వరకు విస్తరిస్తామని, ప్రపంచ చిప్ కొరత మధ్య నిఖార్సయిన ఆత్మనిర్భరతను సాధించాలని ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. ఈ ప్రణాళిక 2025 ఏప్రిల్ లో 22,919 కోట్ల రూపాయలతో ప్రారంభించిన ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పథకం (ECMS)కు కొనసాగింపుగా నిర్మల సీతారామన్ అభివర్ణించారు. ఈ పథకం లక్ష్యానికి రెట్టింపు పెట్టుబడిని సాధించాలని భావిస్తోన్నామని, సెమీకండక్టర్ రంగంలో ప్రపంచ దిగ్గజాలను అధిగమించేలా, దేశ ఎలక్ట్రానిక్స్ సప్లై చైన్ ను మరింత ప్రోత్సహించేలా బడ్జెట్ నిధుల కేటాయింపును 40,000 కోట్ల రూపాయలకు పెంచుతున్నట్లు తెలిపారు.
దీని ద్వారా ఈ రంగం మరింత పురోగమిస్తుందని, ఉద్యోగ- ఉపాధి అవకాశాలను మెరుగుపర్చుతుందని, హై-వేల్యూ గల ఎలక్ట్రానిక్స్, చిప్ ఉత్పత్తి సాధ్యమవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. దీనికితోడు ఉత్పాదకతను పెంచడానికి అవసరమైన క్యాపిటల్ గూడ్స్ పై కూడా కేంద్రం దృష్టి పెడుతుందని చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు రెండు ప్రదేశాలలో హైటెక్ టూల్ రూమ్‌లను ఏర్పాటు చేయనున్నాయి. ఇవి డిజిటల్, ఆటోమేటెడ్ సేవా కేంద్రాలుగా పని చేస్తాయి.
