Kashmir Jails : పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు మరో పెద్ద ఉగ్రదాడికి స్కెచ్ గీశారా ? ఈసారి జమ్మూకశ్మీరులోని జైళ్లపై దాడులకు పథక రచన చేశారా ? అంటే.. భారత నిఘా వర్గాలు ఔననే సమాధానమే చెబుతున్నాయి. జమ్మూకశ్మీర్ జైళ్లలో ప్రస్తుతం ఎంతోమంది హైప్రొఫైల్ ఉగ్రవాదులు ఉన్నారు. ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడితో లింకులున్న స్లీపర్ సెల్స్, ఓవర్ గ్రౌండ్ వర్కర్లను తీసుకొచ్చి ఈ జైళ్లలోనే ఉంచారు. భారత ఆర్మీ వాహనంపై దాడి కేసులో నిందితులైన నిస్సార్, ముష్తాక్ సహచరులను కూడా ఇక్కడి జైళ్లలోనే జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రశ్నిస్తోంది. ఈనేపథ్యంలో జమ్మూకశ్మీరులో ఉన్న జైళ్లపై దాడి చేసి, ఉగ్రవాదులను విడిపించేందుకు ఉగ్రవాద సంస్థలు కుట్ర పన్నాయని భారత నిఘా వర్గాలకు సమాచారం అందింది.
Also Read :What is Santhara: సంతారా దీక్ష.. మూడేళ్ల చిన్నారి ప్రాణత్యాగం.. ఎందుకు ?
ఆ జైళ్లకు భద్రత పెంపు
ఉగ్రవాద దాడుల ముప్పు ఉన్నందున శ్రీనగర్ సెంట్రల్ జైల్, కోట్ బాల్వాల్ జైల్, జమ్మూలోని జైళ్లకు భద్రతను మరింత పెంచారు. ఈ అంశంపై చర్చించేందుకు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) డీజీ శ్రీనగర్‌లో ఉన్నతాధికారులతో ఈ అంశంపై భేటీ అయినట్లు సమాచారం. జైళ్లలో ఉన్న కరుడుగట్టిన ఉగ్రవాదుల సమాచారంపై, వారు ఉండే సెల్స్‌కు భద్రత పెంపుపై చర్చించినట్లు తెలుస్తోంది. 2023 సంవత్సరం నుంచి జమ్మూకశ్మీర్‌లో జైళ్ల భద్రత సీఐఎస్ఎఫ్ ఆధీనంలోనే ఉంది.
Also Read :Sita Navami 2025: ఈరోజే సీతా నవమి.. పూజ ఎలా చేయాలి ? దీన్ని ఎందుకు జరుపుకుంటారు ?
సురాన్ కోట్ అడవుల్లో ఉగ్ర స్థావరం
జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లా సురాన్ కోట్ అడవుల్లో(Kashmir Jails) తాజాగా భద్రతా దళాలు ఒక ఉగ్రస్థావరాన్ని గుర్తించాయి. దీనిలో కమ్యూనికేషన్ పరికరాలు, ఐదు ఐఈడీ బాంబులు దొరికాయి. వీటిలో మూడు ఐఈడీ బాంబులను టిఫిన్‌లో పెట్టి, స్టీలు పెట్టెల్లో దాచారని గుర్తించారు. మూడు ఐఈడీ బాంబులను టిఫిన్‌లో పెట్టి త్వరలోనే ఏదైనా పేలుడు జరపాలని ఉగ్రవాదులు భావించి ఉండొచ్చని సైనిక వర్గాలు తెలిపాయి. ఇలాంటి ఉగ్ర స్థావరాలను అడ్డాగా వాడుకొని జైళ్లపై ఉగ్రదాడులకు పాల్పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఉగ్రవాదులు తమ వద్దనున్న కమ్యూనికేషన్ పరికరాలతో పరస్పరం కమ్యూనికేట్ చేసుకునే వారని తేలింది.