Site icon HashtagU Telugu

Terrorist Attacks : కశ్మీరులో ఉగ్రదాడి.. పాక్ ఆర్మీ చీఫ్ కుట్ర.. కారణం అదే !

Terrorist Attacks India Jd Vance Jammu Kashmir Pakistan Army Chief

Terrorist Attacks: అగ్రరాజ్యం అమెరికాతో భారత్ సంబంధాలను బలోపేతం చేసుకోవడం పాకిస్తాన్‌కు అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకంటే గతంలో పాకిస్తాన్‌కు చాలా పెద్ద మిత్రదేశం అమెరికా. పాకిస్తాన్‌కు గతంలో పెద్దసంఖ్యలో యుద్ధ విమానాలను విక్రయించిన చరిత్ర అమెరికాకు ఉంది. పాక్‌కు పెద్ద సంఖ్యలో ఉచిత గ్రాంట్లు, రుణాలు ఇచ్చిన చరిత్ర అమెరికాకు ఉంది. అందుకే అమెరికా.. భారత్‌కు చేరువ కావడాన్ని పాక్ ఓర్వలేదు. ఈ కారణం వల్లే అమెరికా నుంచి ప్రత్యేక అతిథులు భారతదేశ పర్యటనలో ఉన్నప్పుడల్లా.. కశ్మీరులో ఉగ్రదాడులను చేయిస్తోంది. ఈవిధమైన కోణంలో జరిగిన ఉగ్రదాడుల(Terrorist Attacks) గురించి ఈ కథనంలో తెలుసుకుందాం..

Also Read :Surgical Strike : మోడీ సీరియస్.. పాక్‌పై మరో సర్జికల్ స్ట్రైక్ తప్పదా ?

పాక్ ఆర్మీ చీఫ్ కుట్ర వల్లే.. 

ప్రస్తుతం భారత్‌లో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ సతీసమేతంగా పర్యటిస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో కశ్మీరులోని పహల్గామ్‌లో టూరిస్టులపై ఉగ్రవాదులు దాడి చేశారు.  భద్రతా దళాల దుస్తుల్లో వచ్చిన టెర్రరిస్టులు.. టూరిస్టుల ఐడీలను పరిశీలించాక వారిపై కాల్పులు జరిపారు.  అయితే ఉగ్రవాదులు కేవలం పురుషులనే లక్ష్యంగా ఎంచుకోవడం గమనార్హం. ‘‘కశ్మీర్‌ గతంలోనూ మా గొంతులోని రక్తనాళంలా ఉండేది. భవిష్యత్తులోనూ ఉంటుంది. మా కశ్మీరీ సోదరులను పోరాటంలో ఒంటరిగా వదిలేయం’’ అంటూ వారం క్రితమే పాక్ ఆర్మీ చీఫ్‌ ఆసిమ్‌ మునీర్‌ ప్రకటించారు.  ఆ వెంటనే పహల్గామ్‌లో ఉగ్రదాడి జరిగింది. అంటే.. పాకిస్తాన్ ఆర్మీ, గూఢచార సంస్థ కలిసి కశ్మీరులోని ఉగ్రవాదులతో ఈ ఎటాక్ చేయించాయనే అనుమానాలు రేకెత్తుతున్నాయి.

విమానాలను మోహరించిన తర్వాతే ఎటాక్

కశ్మీరులో ఉన్న పాకిస్తాన్ గూఢచార సంస్థ స్లీపర్ సెల్స్‌ను వాడుకొని ఈ ఉగ్రదాడికి ప్లానింగ్ చేయించి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. మంగళవారం రోజు కశ్మీరులో పహల్గాం ఉగ్రదాడి జరగడానికి ముందే.. పాకిస్తాన్ వాయుసేనకు చెందిన రవాణా, నిఘా విమానాలను కరాచీ నుంచి లాహోర్‌, రావల్పిండి బేస్‌లకు తరలించడం ఈ అనుమానాలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. ఈ దాడికి సంబంధించిన ప్లాన్‌ను లష్కరే తైబా ఉగ్రవాద సంస్థ కమాండర్‌ సైఫుల్లా కుసురీ అలియాస్ ఖలీద్‌ రెడీ చేశాడని అంటున్నారు. ఈ దాడికి పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఇద్దరు ఆపరేటివ్‌లు కూడా సహకరించారని సమాచారం. ఇక ఈ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులు లష్కరే తైబా అనుబంధ సంస్థ ‘ది రెసిస్టెన్స్‌ ఫోర్స్‌’కు చెందినవారు. ఈ ఉగ్రదాడిని ఉగ్రవాదులు కెమెరాల్లో షూట్ చేశారని అంటున్నారు.

తీవ్ర ఒత్తిడిలో ఆసిమ్‌ మునీర్‌ 

గత కొన్ని నెలలుగా పాక్ ఆర్మీ చీఫ్‌ ఆసిమ్‌ మునీర్‌ తీవ్ర ఒత్తిడిలో పనిచేస్తున్నారు. ఆయన్ను పదవి నుంచి పీకేయాలంటూ పాకిస్తాన్‌ ఆర్మీలోని ఓ వర్గం పట్టుబడుతోంది. లేదంటే తామంతా కలిసి తిరుగుబాటు చేసి, ఆసిమ్ మునీర్‌ను తన్ని తరిమేస్తామంటూ పాక్ ఆర్మీలోని ఓ వర్గం సంచలన లేఖను విడుదల చేసింది. ఆసిమ్ మునీర్ పాక్ ఆర్మీలో  నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని ఆ వర్గం ఆరోపిస్తోంది. ఈ తరుణంలో తనపై ఉన్న నెగెటివ్ ముద్రను చెరిపివేసుకునే ప్రయత్నంలో భాగంగా స్వయంగా పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ కశ్మీరులో ఉగ్రదాడి చేయించి ఉంటారని భావిస్తున్నారు.

Also Read :Pahalgam Terror Attack: పహల్గామ్‌లో ఉగ్రవాద దాడి.. ఎయిరిండియా సంచ‌ల‌న నిర్ణ‌యం!

2000 సంవత్సరం మార్చి 20న ఇదే తరహాలో.. 

2000 సంవత్సరం మార్చి 20న కశ్మీరులోని అనంత్‌నాగ్‌ జిల్లా ఛత్తీసింగ్‌పొరలో ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో  36 మంది ప్రజలు ప్రాణాలను కోల్పోయారు. చనిపోయిన వారిలో ఎక్కువ మంది సిక్కువర్గం వారే. వాస్తవానికి ఆ టైంలో  అమెరికా అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ న్యూఢిల్లీ పర్యటనలో ఉన్నారు. జమ్మూకశ్మీర్‌ అంశాన్ని అంతర్జాతీయం చేయాలనే లక్ష్యంతోనే ఆనాడు ఈ ఉగ్రదాడికి పాల్పడ్డారు. అప్పట్లోనూ ఉగ్రవాదులు సైనిక దుస్తుల్లోనే ఛత్తీసింగ్‌పొర గ్రామంలోకి వెళ్లారు. పురుషులను ఇళ్ల నుంచి బయటకు పిలిచారు.  వారందరినీ గురుద్వారా వద్ద ఉంచి కాల్చి చంపేశారు. సైన్యమే ఆ పని చేసిందని అందరినీ నమ్మించేందుకు ఉగ్రవాదులు ఆనాడు యత్నించారు.