Jammu and kashmir : మరోసారి జమ్ము కశ్మీర్‌లో ఉగ్రదాడి జరిగింది. ఆదివారం శ్రీనగర్ సండే మార్కెట్‌లోని టూరిస్ట్ సెంటర్ ఆఫీస్ పై ఉగ్రవాదులు గ్రనేడ్‌లు విసిరారు. ఈ దాడిలో పది 12 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. అయితే క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సీనియర్ పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం..టీఆర్‌సీ సమీపంలో రద్దీగా ఉండే మార్కెట్‌లో ఉగ్రవాదులు గ్రెనేడ్ విసిరారు. ఈ ఘటనలో 12 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉన్నది. అందరికి చిన్న గాయాలు మాత్రమే అయ్యాయని.. ఎవరికీ ప్రాణాపాయం లేదని పోలీసులు తెలిపారు. దాడి సంఘటన జరిగిన వెంటనే, ఉగ్రవాదులను పట్టుకునేందుకు భద్రతా దళాలు మొత్తం ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. దాడికి సంబంధించి మరింత సమాచారం సేకరించేందుకు దర్యాప్తు ప్రారంభించారు. అయితే, ప్రాథమిక సమాచారం ప్రకారం క్షతగాత్రుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. పోలీసులు వేగంగా స్పందించి భద్రతను కట్టుదిట్టం చేశారు.
అయితే శ్రీ నగర్ లాల్ చౌక్‌ను ఆనుకున్న రోడ్డులోనే సండే మార్కెట్ పేరిట వారాంతపు సంత నిర్వహిస్తారు. మార్కెట్ కారణంగా టీఆర్‌సీ గ్రౌండ్‌లో విపరీతమైన జన రద్దీ నెలకొంది. ఇదే అదనుగా భావించిన ఉగ్రవాదులు మైదానంలోకి గ్రనేడ్లు విసిరినట్లు స్థానిక మీడియా చానెల్స్ కథనాలు ఇస్తున్నాయి. దాడి జరిగిన వెంటనే పారామిలిటరీ బలగాలు ఆ ప్రాంతాన్ని తమ స్వాధీనంలోకి తీసుకున్నాయి. క్షతగాత్రుల్ని ఆస్పత్రులకు చేర్చాయి. ప్రస్తుతం అక్కడ ఉగ్రవాదుల కోసం గాలింపు కొనసాగుతోంది. లష్కరే తాయిబా గ్రూప్‌కు చెందిన టాప్ కమాండర్ ఒకరిని.. ఖన్యార్ ప్రాంతంలో భారత సైన్యం మట్టుపెట్టింది. ఆ మరుసటి రోజే ఈ దాడి జరగడం గమనార్హం.