High Alert : పొరుగు దేశం నేపాల్‌లో గత రెండు రోజులుగా తీవ్ర స్థాయిలో చెలరేగిన హింసాత్మక నిరసనల నేపథ్యంలో భారత్-నేపాల్ సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. నేపాల్‌లో చోటుచేసుకుంటున్న రాజకీయ, సామాజిక అస్థిరతను తమ ప్రయోజనాలకు వాడుకునే అవకాశం ఉన్నవారిపై నిఘా కొనసాగించాలన్న ఆదేశాలను కేంద్ర ఇంటెలిజెన్స్ సంస్థలు విడుదల చేశాయి. ఇంటెలిజెన్స్ నివేదికల ప్రకారం, నేపాల్‌లో నెలకొన్న అశాంతి వాతావరణాన్ని ఆసరాగా తీసుకుని, కొందరు రాడికల్ గ్రూపులు భారత సరిహద్దు రాష్ట్రాల్లోకి ప్రవేశించి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అవకాశముందని హెచ్చరించారు. దీంతో సరిహద్దులోని రాష్ట్రాల్లోని పోలీస్ శాఖలు, సశస్త్ర సీమా బలగాలు (SSB) అప్రమత్తమయ్యాయి. సరిహద్దు ప్రాంతాల్లో నిఘా పెంచడంతో పాటు చెక్‌పోస్టుల వద్ద కఠిన తనిఖీలు ప్రారంభించాయి.
Read Also: Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు కీలక సూచనలు..!
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చంపావత్ జిల్లా నేపాల్‌లోని మహేంద్రనగర్‌కు ఆనుకొని ఉంటుంది. అక్కడి పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో నేపాల్ సైన్యం కర్ఫ్యూ విధించింది. దాంతో భారత వైపు సరిహద్దుల్లో కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఉత్తరాఖండ్‌లోని మరో సరిహద్దు జిల్లా పితోర్‌గఢ్‌లోని ధార్చులాలో కూడా నిఘా చర్యలు బలపరచబడ్డాయి. అక్కడి ప్రజల్లో చాలా మందికి నేపాల్‌లో బంధువులు ఉండటం వల్ల వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీహార్ రాష్ట్రంలోని మధుబని జిల్లాలో కూడా అలర్ట్ కొనసాగుతోంది. ఎస్‌ఎస్‌బీ బలగాలను అక్కడ మోహరించారు. మధుబని జిల్లా ఎస్పీ యోగేంద్ర కుమార్ మాట్లాడుతూ ..నేపాల్‌లోని పరిణామాల నేపథ్యంలో మధుబని పోలీసులు పూర్తి అప్రమత్తంగా ఉన్నారు. సరిహద్దు దాటే ప్రతి ఒక్కరి గుర్తింపు కార్డులు ఖచ్చితంగా తనిఖీ చేస్తున్నాం. అసాంఘిక శక్తులు సరిహద్దు దాటకుండా బలమైన భద్రత ఏర్పాటు చేశాం అని తెలిపారు.
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో నేపాల్ సరిహద్దుకు ఆనుకొని ఉన్న ఏడు జిల్లాల్లో భద్రత కఠినంగా అమలవుతోంది. పిలిభిత్, లఖింపూర్ ఖేరిలో బీఎస్‌ఎఫ్, ఎస్‌ఎస్‌బీ బలగాలతో కలసి పోలీసు విభాగం సంయుక్తంగా పెట్రోలింగ్ నిర్వహిస్తోంది. డీజీపీ రాజీవ్ కృష్ణ మాట్లాడుతూ..ఈ సరిహద్దు జిల్లాల్లో 73 చెక్‌పోస్టుల వద్ద రౌండ్ ది క్లాక్ తనిఖీలు జరుపుతున్నాం. ఎలాంటి చలనం కనిపించినా వెంటనే చర్యలు తీసుకుంటాం అని తెలిపారు. లఖింపూర్ ఎస్‌ఎస్‌పీ సంకల్ప్ శర్మ మాట్లాడుతూ .. ప్రాంతీయ భద్రతా సంస్థలతో కలిసి సమన్వయంగా ముమ్మర గస్తీ నిర్వహిస్తున్నాం అని వివరించారు. పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లాలోని పానీటంకీ వద్ద సరిహద్దు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. అక్కడ కూడా ఎస్‌ఎస్‌బీ, ఇతర భద్రతా బలగాలు నిరంతర నిఘా కొనసాగిస్తున్నాయి. ఈ మొత్తం పరిణామాల నేపథ్యంలో, భారత ప్రభుత్వం కేవలం దేశీయ భద్రత పరిరక్షణకే కాకుండా, నేపాల్‌లో చోటు చేసుకుంటున్న పరిణామాలను సమీపంగా గమనిస్తూ సరిహద్దు ప్రాంతాల భద్రతను సమర్థంగా నిర్వహిస్తోంది. భవిష్యత్‌లో ఎలాంటి ప్రమాదకర సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు.