Manmohan Singh : ఢిల్లీలోని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ భౌతికకాయానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాళులు అర్పించారు. మోతీలాల్ నెహ్రూ మార్గ్ లో ఉన్న మన్మోహన్ నివాసంలో ఆయన భార్య గురు శరణ్ కౌర్, కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి పరామర్మించారు. మన్మోహన్ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాని తెలిపారు. దేశంలోనే గొప్ప ఆర్థిక వేత్త, నాయకుడని కోల్పోయిందని ఆయన మరణం ఎంతో బాధాకరమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తన రాజకీయ, ప్రజా జీవితంలో ఔన్నత్యాన్ని ప్రదర్శించిన భూమి పుత్రుడిని దేశం కోల్పోయిందన్నారు. సీఎం వెంట పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ , ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జీ దీపాదాస్ మున్షీ , మంత్రి దామోదర రాజనర్సింహ , ఎంపీలు మల్లు రవి, బలరామ్ నాయక్, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్, పార్టీ నేతలు సంపత్ కుమార్, జేడీ శీలం తదితరులు ఉన్నారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి నివాళులు అర్పించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ..దేశానికి మన్మోహన్ అవిశ్రాంతంగా సేవలందించారని, ఆయన మరణం ఎంతో బాధాకరమని పేర్కొన్నారు. దేశం గొప్ప ఆర్ధిక సంస్కర్తను కోల్పోయిందని ఆయన మరణం ఎంతో బాధాకరమని పేర్కొన్నారు. ఆయన లేని లోటు తీర్చలేనిదన్నారు. దూరదృష్టితో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారని చంద్రబాబు కొనియాడారు. గ్రామీణ ఉపాధి హామీ, ఆధార్, ఆర్టీఐ, విద్యా హక్కు చట్టం తీసుకువచ్చారని తెలిపారు. మన్మోహన్ తన సుదీర్ఘ ప్రస్థానంలో అనేక ఉన్నత పదవులు చేపట్టారని, ఆయా పదవులను సమర్థవంతంగా నిర్వర్తించారని కీర్తించారు. చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, టీడీపీ ఎంపీలు కేశినేని చిన్ని, డాక్టర్ బైరెడ్డి శబరి కూడా మన్మోహన్ సింగ్ కు నివాళులు అర్పించారు.
కాగా, మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు బీఆర్ఎస్ ముఖ్య నేతలు హాజరు కానున్నారు. ఆర్థిక సంస్కరణల పితామహుడు మన్మోహన్ సింగ్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలోని పార్టీ ఎంపీలు, నాయకుల బృందం ఘన నివాళులర్పించనుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు కేటీఆర్, ఎంపీలు, ప్రతినిధుల బృందం మన్మోహన్ సింగ్ అంత్యక్రియల్లో పాల్గొననున్నారు. మన్మోహన్ సింగ్‌కు బీఆర్ఎస్ నేతలు ఘనంగా వీడ్కోలు పలకనున్నారు.
Read Also: Sanjay Nirupam : మన్మోహన్ సింగ్ పై సంజయ్ నిరుపమ్ సంచలన కామెంట్స్