Site icon HashtagU Telugu

Paper Leak – Telegram : టెలిగ్రాంలో ‘నెట్’ ప్రశ్నాపత్రం లీక్.. రూ.10వేలకు అమ్మేశారు ?

Paper Leak Telegram

Paper Leak – Telegram : యూజీసీ నెట్ ప్రశ్నాపత్రం గత ఆదివారం (జూన్ 16న) డార్క్ వెబ్‌లో, ఎన్‌క్రిప్టెడ్‌ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంలలో లీకైంది. ఈవిషయాన్ని స్వయంగా కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ గుర్తించింది. కేంద్ర హోం శాఖకు చెందిన సైబర్ క్రైం కంట్రోల్ సెల్ కూడా ఈవివరాలను ధ్రువీకరించింది. ఈ కీలకమైన ప్రశ్నాపత్రానికి రేటు కట్టి విక్రయించేందుకు పేపర్ లీక్ మాఫియా వాళ్లు టెలిగ్రామ్‌ యాప్‌ను వాడుకున్న విషయం వెలుగులోకి వచ్చింది. టెలిగ్రామ్‌లో సర్క్యులేట్ అయిన నెట్ ప్రశ్నపత్రం.. జూన్ 18న జరిగిన పరీక్షలో వచ్చిన  ఒరిజినల్‌ ప్రశ్నపత్రంలో సరిపోలిందని స్వయంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్  ధృవీకరించారు. అయితే నెట్ ప్రశ్నపత్రం అమ్ముడుపోయిన రేటుకు సంబంధించిన తీరొక్క వార్తలు జాతీయ మీడియాలో వస్తున్నాయి. టెలిగ్రామ్‌లో ఈ క్వశ్చన్ పేపరు కేవలం రూ.5వేల నుంచి రూ.10వేలకే అమ్ముడుపోయిందని కొన్ని మీడియాలలో వార్తలు వచ్చాయి. డార్క్ వెబ్‌లో ఈ ప్రశ్నపత్రం దాదాపు రూ.6 లక్షలకు అమ్ముడుపోయిందని కథనాలు వచ్చాయి.

We’re now on WhatsApp. Click to Join

ఈనేపథ్యంలో టెలిగ్రామ్ కంపెనీ స్పందించింది. తమ సోషల్ మీడియా వేదికను వాడుకొని నెట్ ప్రశ్నాపత్రాన్ని లీక్ చేసిన అన్ని అకౌంట్లపై చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. ఆయా టెలిగ్రామ్ ఛానల్స్‌ను ఇప్పటికే బ్లాక్ చేసినట్లు తెలిపింది. ‘‘భారతదేశ చట్టానికి లోబడి మేం పనిచేస్తాం. ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తులో మేం భారత ప్రభుత్వ అధికారులకు పూర్తి సహకారం అందిస్తాం’’ అని టెలిగ్రామ్ ప్రకటించింది.  నెట్ ప్రశ్నపత్రం లీకేజీ నేపథ్యంలో జూన్ 25 నుంచి 27 వరకు జరగాల్సి ఉన్న సీఎస్ఐఆర్-నెట్ పరీక్షను కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఎం) వాయిదా వేసింది. త్వరలోనే పరీక్ష తేదీలను ప్రకటిస్తామని ఎన్‌టీఏ వెల్లడించింది. ఈసారి యూజీసీ నెట్‌ పరీక్షకు దాదాపు 11 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌నకు అర్హత సాధించడానికి, పీహెచ్‌డీల్లో ప్రవేశాలకు, విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల నియామకాలకు అర్హత సాధించడానికి నెట్ పరీక్షను ప్రమాణంగా పరిగణిస్తారు.

Also Read : Fancy Number: వెహికల్‌ కోసం ఫ్యాన్సీ నంబర్ బుకింగ్ ఇలా..