TCS Nashik Conversion Case: మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ నాసిక్ మతమార్పిడి కేసులో ఇప్పుడు ఒక కొత్త మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో మాస్టర్‌మైండ్‌గా భావిస్తున్న కంపెనీ హెచ్‌ఆర్ హెడ్ నిదా ఖాన్ గురించి దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిదా తన లాయర్ ద్వారా ముందస్తు బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఆమె ఎక్కడికీ పారిపోలేదని, ప్రస్తుతం గర్భిణిగా ఉన్నందున ముంబైలో తన కుటుంబంతో కలిసి ఉంటున్నారని ఆమె తరపు న్యాయవాది తెలిపారు. కంపెనీ ఉద్యోగులను మతమార్పిడికి ప్రోత్సహించారనే ఆరోపణలు నిదా ఖాన్‌పై ఉన్నాయి.
9 ఎఫ్ఐఆర్లు, ఏడుగురు నిందితుల అరెస్ట్
ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం 9 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వీరిలో ఆరుగురు పురుషులు, ఒక మహిళా ఆపరేషన్స్ మేనేజర్ ఉన్నారు. కంపెనీలోని హిందూ ఉద్యోగులను ప్రలోభపెట్టి, బెదిరించి, ఒత్తిడి తీసుకొచ్చి ఇస్లాం మతంలోకి మారేలా బలవంతం చేశారని నిదాపై ఆరోపణలు ఉన్నాయి. అలాగే లైంగిక వేధింపులు, బ్లాక్ మెయిలింగ్, మతమార్పిడిలో నిందితులకు సహకరించినట్లు కూడా ఆమెపై కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర పోలీసుల ప్రత్యేక విచారణ బృందం ప్రస్తుతం నిదా ఖాన్ కోసం గాలిస్తోంది.
Also Read: Andhra Pradesh: ఏపీలో రూ.82.49 కోట్లతో ఫైవ్ స్టార్ హోటల్
నాసిక్ పోలీసుల, కంపెనీ వివరణ
మహారాష్ట్ర పోలీసుల ప్రత్యేక విచారణ బృందం ఈ కేసును లోతుగా దర్యాప్తు చేస్తోంది. బాధితుల నుండి వచ్చిన అన్ని ఫిర్యాదులను పరిశీలిస్తున్నామని, విచారణలో తేలిన నిజాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఈ కేసులో విదేశీ నిధుల ప్రమేయం, ఇతర వ్యక్తుల పాత్రపై కూడా ఆరా తీస్తున్నారు. మరోవైపు నిదా ఖాన్ హెచ్‌ఆర్ విభాగంలో ఎగ్జిక్యూటివ్ మేనేజర్‌గా పనిచేశారని వార్తలు రాగా, కంపెనీ మాత్రం ఆ విషయాన్ని ఖండించింది. నిదా నాసిక్ బిపిఓ యూనిట్‌లో కేవలం టెలికాలర్‌గా మాత్రమే పనిచేసేదని కంపెనీ స్పష్టం చేసింది.
బాధితులు చేసిన ఆరోపణలు ఏమిటి?
పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుల్లో బాధితులు కొన్ని కీలక విషయాలను బయటపెట్టారు. ఆఫీసులో ఇస్లాం మతాన్ని స్వీకరించాలని తమపై తీవ్రమైన మానసిక ఒత్తిడి తీసుకొచ్చేవారని తెలిపారు. ఉద్యోగులు ఇస్లాం మత పద్ధతులను పాటించాలని బలవంతం చేసేవారు. నమాజ్ చేయడం, ఆహారపు అలవాట్లను మార్చుకోవాలని ఒత్తిడి చేసేవారు. నిందితులు ఒక గ్రూపుగా ఏర్పడి ఉద్యోగులపై ఒత్తిడి తీసుకొచ్చేవారు. వాట్సాప్ గ్రూపుల ద్వారా అవసరాల్లో ఉన్నవారిని, జీతం పెంపును ఆశించేవారిని గుర్తించి వారిని లక్ష్యంగా చేసుకునేవారు.
