Site icon HashtagU Telugu

US Tariffs : భారత్‌పై సుంకాల కొరడా.. నేటి నుంచే 25 శాతం అదనపు సుంకం అమల్లోకి

Tariffs on India.. 25 percent additional tariff to come into effect from today

Tariffs on India.. 25 percent additional tariff to come into effect from today

US Tariffs : భారత్-అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలు తాజాగా తీవ్రమైన మలుపు తిరిగాయి. ఐదు దఫాలుగా జరిగిన వాణిజ్య చర్చలు విఫలమైన నేపథ్యంలో, భారత ఉత్పత్తులపై భారీగా అదనపు సుంకాలు విధించనున్నట్లు అమెరికా ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించింది. ఈ పన్నులు వెంటనే అమల్లోకి వస్తాయని హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ ఒక అధికారిక నోటీసు ద్వారా వెల్లడించింది. ఈ నేపథ్యంలో భారత ఎగుమతిదారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

రష్యా చమురు కొనుగోలు… కారణంగా అమెరికా ఆగ్రహం

ఈ నిర్ణయానికి ముఖ్య కారణంగా భారత్‌ రష్యా నుంచి అధిక మొత్తంలో చమురు కొనుగోలు చేయడమేనని అమెరికా పేర్కొంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో భారత్ అటు రష్యాకు పరోక్షంగా ఆర్థిక మద్దతు ఇస్తోందని ఆరోపణలు వెల్లువెత్తాయి. వైట్‌హౌస్ ట్రేడ్ అడ్వైజర్ పీటర్ నవారో, ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ మాట్లాడుతూ..”ఇది కేవలం వాణిజ్య వ్యవహారం కాదు, ఇది జాతీయ భద్రతకు సంబంధించిన అంశం అని పేర్కొన్నారు.

భారీ పన్నులు, 50% వరకు సుంకాల పెంపు

అమెరికా నిర్ణయంతో భారత ఉత్పత్తులపై 25 శాతం అదనపు పన్నులు విధించబడ్డాయి. దీంతో కొన్ని కీలక ఉత్పత్తులపై మొత్తం సుంకాల బరువు 50 శాతం వరకు పెరగనుంది. ముఖ్యంగా వజ్రాలు, జౌళి, తోలు ఉత్పత్తులు వంటి రంగాలు దీని ప్రభావంతో తీవ్రంగా నష్టపోవచ్చని భావిస్తున్నారు. ఇంజినీరింగ్ ఎక్స్‌పోర్ట్స్ ప్రమోషన్ కౌన్సిల్ అధ్యక్షుడు పంకజ్ చాధా మాట్లాడుతూ ..ఇప్పటికే అమెరికా కొనుగోలుదారులు కొత్త ఆర్డర్లను నిలిపివేశారు. సెప్టెంబర్ నాటికి భారత ఎగుమతులు 20-30 శాతం వరకు పడిపోవచ్చు అని చెప్పారు. ఈ నిర్ణయం దాదాపు 87 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులపై ప్రభావం చూపనున్నట్లు పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

భారత్ ప్రతిస్పందన, ప్రత్యామ్నాయ మార్గాల కోసం ప్రయత్నం

ఈ పరిణామాలపై స్పందించిన భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికారి మాట్లాడుతూ..తక్షణ ఉపశమనం ఆశించడం కష్టమే. అయినా సుంకాల ప్రభావం పడిన ఎగుమతిదారులకు ఆర్థిక సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. చైనా, లాటిన్ అమెరికా, మధ్యప్రాచ్యం వంటి ప్రత్యామ్నాయ మార్కెట్లపై దృష్టి పెట్టాలని ప్రోత్సహిస్తున్నాం అని తెలిపారు.

జైశంకర్ స్పందన, భిన్న ధోరణిపై విమర్శ

విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ మాట్లాడుతూ..ఇది ద్వంద్వ నీతి. అదే చమురును కొనుగోలు చేస్తున్న ఇతర దేశాలపై ముద్ర వేయకుండా, భారత్‌పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం అన్యాయం. భారత్‌ తగిన విధంగా స్పందిస్తుంది అని స్పష్టం చేశారు. ఇక, వాణిజ్య రంగంలో తలెత్తిన వివాదాల మధ్య, ఇరు దేశాల రక్షణ, భద్రతా సహకారం మాత్రం నిలబడేలా చూస్తున్నట్లు అమెరికా మరియు భారత్ విదేశాంగ శాఖలు సంయుక్త ప్రకటనలో తెలిపాయి. వాణిజ్యంలో విభేదాలున్నా, వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతుంది అని అందులో పేర్కొన్నారు.

Read Also: Telangana Cabinet : క్యాబినెట్ భేటీ 30కి వాయిదా