Taj Mahal : తాజ్ మహల్ మనదేశానికే గర్వకారణం. చాలా దేశాల టూరిస్టులు తాజ్ మహల్‌ను చూసేందుకు మన దేశానికి వస్తుంటారు. అంతటి ఖ్యాతి కలిగిన తాజ్ మహల్‌లోని ప్రధాన డోమ్ (గుమ్మటం) నుంచి నీరు లీక్ అవుతోంది. గత మూడు రోజులుగా ఆగ్రా నగరంలో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. ఆ వర్షాల వల్లే తాజ్ మహల్‌లోని ప్రధాన గుమ్మటంలోకి నీరు ఇంకిపోయి లీక్ అవుతోందని గుర్తించారు. వర్షాల కారణంగా తాజ్ మహల్ ప్రాంగణంలోని ఓ గార్డెన్ నీట మునిగి పోయింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎంతోమంది టూరిస్టులు దీన్ని తమ ఫోన్లలో షూట్ చేసి ఎవరికి వారుగా సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ చేశారు.
Also Read :Zomato : రైల్వేశాఖతో జొమాటో ఒప్పందం.. 100కుపైగా రైల్వే స్టేషన్లలో ఫుడ్ డెలివరీ
తాజ్ మహల్ ప్రధాన గుమ్మటం(Taj Mahal) నుంచి నీరు లీకవుతున్న విషయాన్ని ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) ఆగ్రా సర్కిల్ చీఫ్ సూపరింటెండెంట్ రాజ్‌కుమార్ పటేల్ కూడా ధ్రువీకరించారు. ఈ లీకేజీ వల్ల డోమ్‌కు వచ్చిన ముప్పేమీ లేదని ఆయన వెల్లడించారు. తాజ్ మహల్ ప్రధాన డోమ్‌కు సంబంధించిన ఫొటోను ఒక డ్రోన్ సాయంతో తీయించి నిశితంగా పరిశీలించామని చెప్పారు.
Also Read :PM Modis Family : దీప్ జ్యోతిని ముద్దాడిన ప్రధాని మోడీ.. వీడియో వైరల్
తాజ్ మహల్‌ను 1632 నుంచి 1653 సంవత్సరం మధ్యకాలంలో నిర్మించారు. మొఘల్ చక్రవర్తి షాజహాన్ దీన్ని కట్టించారు. ఇందులో షాజహాన్ భార్య ముంతాజ్ మహల్ సమాధి ఉంది. గర్భిణిగా శిశువుకు జన్మనిచ్చే క్రమంలో ఆమె చనిపోయారు. పర్షియన్, ఇస్లామిక్, భారతీయ నిర్మాణ శైలిలో తాజ్‌మహల్‌ను రూపుదిద్దారు. వందల ఏళ్లు గడిచినా తాజ్ మహల్ ఎవర్ గ్రీన్ టూరిస్టు స్పాట్‌గా వెలుగొందుతోంది. మనదేశంలోని టాప్ టూరిస్టు డెస్టినేషన్‌గా అది ఖ్యాతిని గడించింది.