Taj Mahal : తాజ్ మహల్‌కు ఇవాళ ఈమెయిల్‌లో బాంబు బెదిరింపు వచ్చింది. తాజ్ మహల్‌లో బాంబు పెట్టామంటూ దుండగులు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖకు బెదిరింపు మెసేజ్ పంపారు. ఆగ్రాలోని ఉత్తరప్రదేశ్ టూరిజం ప్రాంతీయ కార్యాలయానికి ఈ హెచ్చరిక సందేశం అందినట్లు తెలుస్తోంది. దీంతో వెంటనే తాజ్ మహల్‌లో బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, స్థానిక పోలీసులు ముమ్మర సోదాలు నిర్వహించారు. అయితే అనుమానాస్పద వస్తువులేవీ లభించలేదు. ఈ బెదిరింపు మెసేజ్ ఆధారంగా ఆగ్రా(Taj Mahal)లోని తాజ్‌గంజ్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. తదుపరి విచారణ కొనసాగుతోంది.
Also Read :Worlds Richest Cricketer : 22 ఏళ్లకే రిటైర్ అయిన క్రికెటర్.. రూ.70వేల కోట్ల ఆస్తి
ఈవివరాలను తాజ్ మహల్ సెక్యూరిటీ విభాగం ఎస్పీ సయ్యద్ అరీబ్ అహ్మద్ మీడియాకు వెల్లడించారు. దీనిపై దర్యాప్తు చేయగా.. అది ఫేక్ బెదిరింపు సందేశమని తేలిందన్నారు. ‘‘తాజ్ మహల్‌కు వచ్చిన బాంబు బెదిరింపు ఈమెయిల్‌ను మేం వెంటనే ఆగ్రా పోలీసులకు పంపాం. ఆగ్రా సర్కిల్ ఏఎస్ఐకు దాన్ని ఫార్వర్డ్ చేశాం’’ అని ఉత్తరప్రదేశ్ టూరిజం విభాగం డిప్యూటీ డైరెక్టర్ దీప్తి వత్స తెలిపారు. ప్రపంచంలోని ఏడు వింతలలో తాజ్ మహల్ ఒకటి. మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ మహల్ జ్ఞాపకార్థం దీన్ని నిర్మించారు.