Site icon HashtagU Telugu

Owaisis Plea : ‘ప్రార్థనా స్థలాల చట్టం’.. ఇవాళ సుప్రీంకోర్టులో ఒవైసీ పిటిషన్‌ విచారణ

Asaduddin Owaisis Plea 1991 Places Of Worship Act Supreme Court Aimim Chief

Owaisis Plea : ‘‘ప్రార్థనా స్థలాల (ప్రత్యేక నిబంధనల) చట్టం- 1991‌’’‌ను అమలు చేయాలని కోరుతూ మజ్లిస్‌ చీఫ్ అసదుద్దీన్‌ ఒవైసీ దాఖలు చేసిన పిటిషన్‌ ఇవాళ సుప్రీం కోర్టులో విచారణకు రానుంది. ఈ చట్టాన్ని పక్కాగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషన్‌లో ఒవైసీ అభ్యర్థించారు. పలుచోట్ల హిందూ పక్షం దాఖలు చేసిన వ్యాజ్యాల ఆధారంగా కొన్ని మసీదుల సర్వేకు కోర్టులు ఆదేశించిన వివరాలను కూడా పిటిషన్‌లో ఆయన పొందుపరిచారు.  ఈ అంశంలో విచారణ పెండింగ్‌లో ఉన్న పిటిషన్లతో ఒవైసీ పిటిషన్‌ను కూడా కలిపే ఛాన్స్ ఉంది. ఒవైసీ(Owaisis Plea) డిసెంబరు 17న తన న్యాయవాది ద్వారా ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. 1947 సంవత్సరం ఆగస్టు 15 నాటికి దేశవ్యాప్తంగా ఉన్న ప్రార్థనా స్థలాల మత స్వభావాన్ని మార్చడానికి వీల్లేదని పేర్కొంటూ 1991లో నాటి  కాంగ్రెస్‌ ప్రభుత్వం ‘‘ప్రార్థనా స్థలాల (ప్రత్యేక నిబంధనల) చట్టం- 1991‌’’‌ను రూపొందించింది.

Also Read :New Orleans Attack: ట్రక్కు దాడి.. మాజీ సైనికుడు షంషుద్దీన్‌ జబ్బార్‌ పనే : జో బైడెన్

‘‘ప్రార్థనా స్థలాల (ప్రత్యేక నిబంధనల) చట్టం- 1991‌’’‌లోని పలు నిబంధనలను సవాల్‌ చేస్తూ ప్రముఖ న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ సహా పలువురు దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్‌ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ వ్యవహారంలో డిసెంబరు 12న సుప్రీంకోర్టు బెంచ్ కీలక ఆదేశాలిచ్చింది. తాము తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు దేశంలోని ఏ కోర్టు కూడా ప్రార్థనా స్థలాలకు సంబంధించిన కొత్త వ్యాజ్యాలను విచారణకు స్వీకరించరాదని ఆర్డర్ ఇచ్చింది. ఇప్పటికే ఉన్న కేసుల్లో సర్వేలకు లేదా నిర్వహణకు ఎలాంటి మధ్యంతర ఆదేశాలు కానీ తుది ఉత్తర్వులు కానీ ఇవ్వరాదని దేశంలోని కోర్టులను సుప్రీంకోర్టు ఆదేశించింది.  దీంతో కాశీలోని జ్ఞానవాపి, మథురలోని షాహీ ఈద్గా మసీదు సహా దేశవ్యాప్తంగా 10 మసీదులు/ముస్లిం ప్రార్థనా మందిరాల్లో సర్వే చేయాలని కోరుతూ దాఖలైన 18 వ్యాజ్యాల్లో తదుపరి విచారణలు నిలిచిపోయాయి. ఒకప్పుడు ఈ మసీదుల స్థానంలో దేవాలయాలు ఉండేవని, దురాక్రమణదారులు వాటిని కూల్చేశారని పేర్కొంటూ హిందూ పక్షాలు పిటిషన్లు వేశారు.

Also Read :CM Revanth: సీఎం రేవంత్‌లో సడెన్ ఛేంజ్‌.. మంత్రులు, ఎమ్మెల్యేల‌కు క్లాస్‌!