NEET UG Paper Leak : ఈ ఏడాది మే 5న జరిగిన నీట్-యూజీ పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రం లీకైన మాట వాస్తవమేనని భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. అయితే ఇది 23లక్షల మందితో జీవితాలతో ముడిపడిన అంశం అయినందున నీట్ పరీక్షను(NEET UG Paper Leak) రద్దు చేసి, తిరిగి నిర్వహించే అంశాన్ని చిట్టచివరి ప్రత్యామ్నాయంగా పరిగణిస్తామని బెంచ్ పేర్కొంది. నీట్ యూజీ పరీక్షలో జరిగిన అవకతవకల వ్యవహారంపై దాఖలైన మొత్తం 38 పిటిషన్లను ఇవాళ సుప్రీంకోర్టు విచారించింది. ‘‘నీట్-యూజీ పరీక్షలో అవకతవకలకు కారణమైన వారిని గుర్తించలేకపోయినా మేం రీ టెస్ట్‌కు ఆదేశిస్తాం. లీకైన ప్రశ్నపత్రం సోషల్‌మీడియాలో వైరల్ అయిందని తెలిసినా మళ్లీ పరీక్ష నిర్వహించాలని ఆదేశిస్తాం. అయితే అంతకంటే ముందు ఆ పేపరు ఎంతమందికి చేరిందనే విషయం తేలాలి’’ అని సుప్రీంకోర్టు బెంచ్ స్పష్టం చేసింది.
We’re now on WhatsApp. Click to Join
‘‘నీట్- యూజీ పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీతో ఇద్దరు స్టూడెంట్స్‌కు మాత్రమే లింకు ఉందని చెబుతున్నారు. అయితే లీక్ ఎలా జరిగింది ? లీకైన పేపర్ ఎంతమందికి చేరింది ? లీకేజీతో లబ్ధిపొందిన విద్యార్థులు ఎవరెవరు ? ఎంతమంది విద్యార్థుల ఫలితాలను హోల్డ్‌లో ఉంచారు? అనే ప్రశ్నలకు సమాధానాల కోసం మేం ఎదురుచూస్తున్నాం. సమగ్ర దర్యాప్తు జరిపి వీటికి సమాధానాలు రాబట్టాలి’’ అని సుప్రీంకోర్టు ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి నిర్దేశించింది. ఆ అంశాలన్నింటిపై ఓ క్లారిటీకి వచ్చిన తర్వాతే తాము తీర్పు ఇస్తామని తేల్చి చెప్పింది. ఈ పరీక్షలో అవకతవకల వ్యవహారంపై దర్యాప్తు ఎక్కడిదాకా వచ్చిందో తెలుపుతూ నివేదిక సమర్పించాలని సీబీఐకి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రశ్నపత్రం తొలిసారి ఎప్పుడు లీకైందన్న విషయాన్ని తమకు తెలియజేయాలన్నారు. ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 11కు సుప్రీంకోర్టు(Supreme Court) వాయిదా వేసింది.
Also Read :Skill University : ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ప్రాంగణంలోనే ‘స్కిల్ యూనివర్సిటీ’ : సీఎం రేవంత్
ఈసారి జరిగిన నీట్-యూజీ పరీక్ష ఫలితాల్లో ఏకంగా 67 మందికి జాతీయస్థాయిలో మొదటి ర్యాంకు వచ్చింది. దీంతో చాలామంది అనుమానాలు వ్యక్తం చేశారు. అందుకే ఈ ర్యాంకులు వచ్చిన వారికి కలిపిన గ్రేస్ మార్కులను తీసేసి.. వారికి గతనెల 23న రీటెస్టు నిర్వహించారు. గత నెల 30వ తేదీన వచ్చిన ఫలితాల్లో.. రీటెస్టు రాసిన చాలామంది అభ్యర్థుల ర్యాంకులు మారిపోయాయి. వారికి సంబంధించి సవరించిన నీట్ ర్యాంకుల జాబితాను ఎన్‌టీఏ(NTA) విడుదల చేసింది.