Bail Rule : సాధారణంగానైతే మనీలాండరింగ్ కేసుల్లో చిక్కుకున్న వారికి బెయిల్ దొరకడం చాలా కష్టతరమనే అభిప్రాయం ఉంది. వాటికి సంబంధించిన అభియోగాలతో నెలల తరబడి నిందితులు జైలులో ఉండాల్సి వస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కల్వకుంట్ల కవిత, మనీశ్ సిసోడియాలపై మనీ లాండరింగ్ అభియోగాలతో ఈడీ కేసులను నమోదు చేసింది. దీంతో వాళ్లిద్దరు నెలల తరబడిలో జైలులో ఉండి ఇటీవలే బయటికి వచ్చారు. ఇలాంటి పరిస్థితి వల్ల ఇబ్బందిపడుతున్న నిందితులకు బెయిల్ మంజూరు అంశాన్ని ఉద్దేశించి ఇవాళ సుప్రీంకోర్టు(Bail Rule) కీలక వ్యాఖ్యలు చేసింది.
We’re now on WhatsApp. Click to Join
మనీలాండరింగ్ కేసుల్లో నిందితులుగా ఉన్నవారు కస్టడీలో ఉన్న టైంలో ఇచ్చే వాంగ్మూలాలను సాక్ష్యంగా పరిగణించకూడదని కేంద్ర దర్యాప్తు సంస్థలకు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కస్టడీలో ఉన్న సమయంలో నిందితులు ఇతరులపై నేరారోపణలు చేసే అవకాశం కూడా ఉంటుందని తెలిపింది. ఆ నిందితులు ఇచ్చే వాంగ్మూలాలను ఆధారంగా తీసుకొని ఇతరులపై కేసులు నమోదు చేయడం న్యాయ నిబంధనలకు విరుద్ధమని దేశ సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
Also Read :Attacks On Trains : రైళ్లపై దాడులకు ఉగ్రకుట్ర.. టెర్రరిస్టు ఘోరీ వీడియో కలకలం
జార్ఖండ్ సీఎం అనుచరుడికి ఊరట..
అక్రమ మైనింగ్‌కు సంబంధించిన వ్యవహారంలో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అనుచరుడు ప్రేమ్ ప్రకాశ్‌ను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అక్రమ మైనింగ్ కేసులో ఆయన పేరును నిందితుల జాబితాలో ఈడీ చేర్చింది. దీంతో బెయిల్ కోసం జార్ఖండ్ హైకోర్టును ప్రేమ్ ప్రకాశ్ ఆశ్రయించారు. అయితే అక్కడ ఊరట లభించలేదు. బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైంది. దీంతో ఆయన సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. తాజాగా ఇవాళ దాన్ని సుప్రీంకోర్టు న్యాయ మూర్తులు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. పిటిషన్‌దారుడైన ప్రేమ్ ప్రకాశ్ నేరం చేసినట్టు కానీ, బెయిల్‌పై విడుదలైతే సాక్షులను ప్రభావితం చేస్తాడని కానీ ఆధారాలు లేవని సుప్రీంకోర్టు బెంచ్ వ్యాఖ్యానించింది. ఈ కారణంతో అతడికి బెయిల్‌ను మంజూరు చేసింది. ఈసందర్భంగా సుప్రీంకోర్టు పలు ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘ఆప్ నేత మనీశ్ సిసోడియా కేసులో తీర్పు ఇస్తూ మేం ఒక విషయాన్ని స్పష్టం చేశాం. ‘‘బెయిల్ రూల్, జైలు మినహాయింపు’’ అనే సిద్ధాంతం మనీలాండరింగ్ కేసులకు కూడా వర్తిస్తుంది. వ్యక్తి స్వేచ్ఛకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.ఏ వ్యక్తి కూడా స్వేచ్ఛను కోల్పోకూడదు. అంతాచట్టబద్ధంగానే జరగాలి’’ అని సుప్రీంకోర్టు బెంచ్ కామెంట్ చేసింది.