Lalit Modi: ఐపీఎల్ వ్యవస్థాపకుడు , మాజీ ఛైర్మన్ లలిత్ మోదీకి సుప్రీం కోర్టు కీలక తీర్పు చెప్పింది. ఫెమా (విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం) ఉల్లంఘన కేసులో తనపై విధించిన రూ.10.65 కోట్ల జరిమానా మొత్తాన్ని బీసీసీఐ (భారత క్రికెట్ నియంత్రణ మండలి) చెల్లించాలని లలిత్ మోదీ కోరిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం సోమవారం తోసిపుచ్చింది. ఈ తీర్పుతో జరిమానా భారం పూర్తిగా మోదీపైనే ఉండనుంది.
ఐపీఎల్ ఛైర్మన్‌గా ఉన్న సమయంలో ఫెమా నిబంధనలు అతిక్రమించారన్న కారణంగా ఈడీ లలిత్ మోదీపై రూ.10.65 కోట్ల జరిమానా విధించింది. అయితే ఇది తన వ్యక్తిగత చర్య కాదని, అధికారిక హోదాలో చేసిన వ్యవహారం కాబట్టి జరిమానా మొత్తాన్ని బీసీసీఐ భరించాలంటూ లలిత్ మోదీ బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
అయితే, హైకోర్టు ఈ వాదనను తిరస్కరించడమే కాకుండా, మరో రూ.1 లక్ష జరిమానా విధించింది. ఆ తర్వాత లలిత్ మోదీ సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ ఆర్. మహదేవన్‌ల ధర్మాసనం హైకోర్టు తీర్పును సమర్థించింది. “బీసీసీఐ జరిమానా చెల్లించాలన్న అభ్యర్థనలో వాస్తవాధారం లేదు” అంటూ తీర్పు వెల్లడించింది.
2010లో లలిత్ మోదీపై ఐపీఎల్ ఆర్థిక వ్యవహారాల్లో అవకతవకల ఆరోపణల నేపథ్యంలో ఆయన భారత్ విడిచి లండన్‌కి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఆయన అక్కడే ఉంటూ, భారత్‌కు ఆయనను తీసుకురావాలని అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. తాజా తీర్పు మోదీకి మరో న్యాయపరమైన ఎదురు దెబ్బగా మారింది.
Karnataka: సీఎం, డిప్యూటీ సీఎం మధ్య విభేదాల ప్రచారానికి చెక్