Bulldozer Action : దేశంలోని పలు రాష్ట్రాల్లో జరుగుతున్న బుల్డోజర్ చర్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రాపర్టీ ఓనర్‌కు 15 రోజులు ముందుగా నోటీసులు జారీ చేసి.. ఆ గడువు ముగిసిన తర్వాతే కూల్చివేతలు చేపట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. కనీస నియమ నిబంధనలు పాటించకుండా ఏకపక్షంగా బుల్డోజర్లతో కూల్చివేతలు చేపట్టడం సరికాదని సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం అభిప్రాయపడింది. ‘‘ఏదైనా వివాదాస్పద ప్రాపర్టీని కూల్చివేయాలని ప్రభుత్వ విభాగాలు గుర్తిస్తే.. తొలుత ఆ ప్రాపర్టీ యజమానికి రిజిస్టర్డ్ పోస్టులో నోటీసులు పంపించాలి. ఆ ప్రాపర్టీపై వివాదం ఎందుకు ఏర్పడిందనేది నోటీసులో వివరించాలి. దాన్ని అక్రమ ఆస్తిగా ఎందుకు పరిగణిస్తున్నారు అనే వివరాలను నోటీసులో తప్పకుండా పొందుపరచాలి. సదరు ప్రాపర్టీ ఓనర్ ఏయే ప్రభుత్వ నియమాలను ఉల్లంఘించాడు అనేది కూడా నోటీసులో ప్రస్తావించాలి’’ అని సుప్రీంకోర్టు బెంచ్(Bulldozer Action) నిర్దేశించింది. ఈ నోటీసులకు ప్రాపర్టీ ఓనరు నుంచి ఎలాంటి స్పందన రాకుంటే.. అప్పుడు కూల్చివేతలు చేపట్టొచ్చు. అయితే కూల్చివేత ప్రక్రియను వీడియో తీయించాలి. నిబంధనలను పాటించకుండా కూల్చివేతలు చేపడితే చట్టపరమైన ధిక్కారంగా పరిగణించాల్సి వస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
Also Read :Elections Today : ఓట్ల పండుగ.. జార్ఖండ్‌లో పోల్స్.. వయనాడ్, 31 అసెంబ్లీ స్థానాల్లో బైపోల్స్
‘‘ప్రజాస్వామిక రాజ్యాంగ భావన జీవించాలంటే.. పౌర హక్కులను పరిరక్షించడం తప్పనిసరి. సమన్యాయ భావన సజీవంగా ఉండాలంటే.. ప్రాపర్టీ యజమానులకు సంజాయిషీ ఇచ్చుకునే కనీస సమయాన్ని ఇవ్వాలి. ఇవన్నీ పట్టించుకోకుండా కూల్చివేతలు చేపట్టడం అంటే చట్టాలకు తిలోదకాలు ఇవ్వడమే’’ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ‘‘కార్యనిర్వాహక విభాగంలో ఉండే ఉన్నతాధికారులు ఎవ్వరూ.. న్యాయమూర్తుల స్థానాన్ని భర్తీ చేయలేరు. ఒకవేళ ఎవరైనా ఉన్నతాధికారి.. తనను తాను జడ్జిలా భావించుకొని చట్టాలను పట్టించుకోకుండా ఏదైనా ఇంటి కూల్చివేతకు ఆదేశాలిస్తే కచ్చితంగా అది చట్టవిరుద్ధమైన చర్యే అవుతుంది. న్యాయపరమైన ప్రక్రియ లేకుండా ప్రభుత్వం నేరుగా ఎవరిపైనా చర్యలు తీసుకోలేదు’’ అని దేశ సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. ‘‘ఏవైనా కూల్చివేతలు చేపడితే.. వాటి వివరాలన్నీ మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు తమతమ పోర్టల్స్‌లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలి’’ అని సూచించింది. ఇలాంటి కూల్చివేత వ్యవహారాలను జిల్లా మెజిస్ట్రేట్లు బాధ్యతాయుతంగా పరిశీలించి, ఎవరికీ అన్యాయం జరగకుండా చూడాలని నిర్దేశించింది.