Supreme Court : దర్యాప్తు పూర్తి అయినప్పటికీ చిన్న చిన్న నేరాల్లో దిగువ కోర్టులు బెయిల్ నిరాకరించడంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజాస్వామ్య దేశం పోలీసుల రాజ్యంలా పని చేయకూదని హితవు పలికింది. ఒక చిన్న కేసులో బెయిల్ కోసం దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. సాధారణ కేసుల్లో సైతం నిందితులకు ఉపశమనం లభించకపోవడం దురదృష్టకరం అని.. అందుకే తాము జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని సుప్రీంకోర్టు చెప్పుకొచ్చింది. 20 ఏళ్ల క్రితం ఇలాంటి కేసుల్లో బెయిల్ పిటిషన్లు హైకోర్టుకు కూడా చేరలేదని.. కానీ ఇప్పుడు సుప్రీం కోర్టు వరకు వస్తున్నాయని చెప్పింది.
Read Also: What Is Autopen : ఏమిటీ ఆటోపెన్ ? బైడెన్ ఏం చేశారు ? నిప్పులు చెరిగిన ట్రంప్
రెండు దశాబ్దాల క్రితం.. చిన్న కేసుల్లో బెయిల్ పిటిషన్లు హైకోర్టు, సుప్రీంకోర్టులకు చాలా అరుదుగా వచ్చేవి. ట్రయిల్ కోర్టు స్థాయిలో పరిష్కారం కావాల్సిన కేసులకు సంబంధించి బెయిల్ పిటిషన్ల విషయంలో అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇవ్వడమనేది దిగ్భ్రాంతి కలిగిస్తోంది. అనవసరంగా వ్యవస్థపై భారం పడుతోంది అని జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఇక్కడ నిజాలతో సంబంధం లేకుండా చట్టం అమలుచేసే సంస్థలు కొందరు వ్యక్తులను నిర్భందించేందుకు ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తారు. అలా చేయడం ఆమోదయోగ్యం కాదని సుప్రీంకోర్టు తెలిపింది.
సుప్రీంకోర్టు ఈ అంశాన్ని గురించి ప్రస్తావించడం ఇదే తొలిసారి కాదు. చిన్నచిన్న నేరాలకు సంబంధించిన కేసుల్లోను బెయిల్ మంజూరుచేయడంలో ట్రయల్ కోర్టులు, హైకోర్టులు మరింత ఉదారవాద వైఖరితో వ్యవహరించాలని సూచించింది. ఒక చిన్న కేసులో రెండేళ్లకు పైగా కస్టడీలో ఉన్న నిందితుడికి బెంచ్ బెయిల్ మంజూరుచేసింది. దర్యాప్తు పూర్తయి ఛార్జిషీట్ దాఖలు చేసినప్పటికీ నిందితుడి బెయిల్ పిటిషన్‌ను ట్రయల్ కోర్టు, గుజరాత్ హైకోర్టు తిరస్కరించాయి. మేజిస్ట్రేట్లు విచారించగలిగే కేసుల్లో బెయిల్ విషయాలను సుప్రీంకోర్టు ముందుకుతీసుకురావడం దురదృష్టకరమని అభయ్ ఎస్ ఓకా అసహనం వ్యక్తం చేశారు.