Stray Dogs: ఢిల్లీ, ఎన్సీఆర్ ప్రాంతాల్లో వీధికుక్కల దాడులు, కుక్కకాటు, రేబిస్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రజల ప్రాణాలను కాపాడటమే ప్రాధాన్యంగా చూస్తున్నామని స్పష్టం చేసిన ధర్మాసనం, ఎన్సీఆర్ పరిధిలోని అన్ని వీధి కుక్కలను ఎనిమిది వారాల్లోపూ షెల్టర్లకు తరలించాలని అధికారులకు స్పష్టంగా ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ జెబి పార్దివాలా, జస్టిస్ ఆర్. మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. వీధుల్లో కుక్కల సంఖ్య భారీగా పెరిగిపోవడం, వాటి దాడుల వల్ల అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతుండడంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇంత వరకు ఎన్ని ప్రాణాలు పోయాయో చూసారా? ఇకనైనా కఠిన చర్యలు తీసుకోవాలి అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
Read Also: Operation Sindoor : పాక్ ఉగ్ర శిబిరాలపై దాడి.. వీడియో విడుదల చేసిన వాయుసేన
ఇది కేవలం జంతుప్రేమ లేదా హక్కుల పరిరక్షణ అనే కోణంలో చూసే అంశం కాదు. ఇది ప్రజల ఆరోగ్యం, జీవన హక్కులతో సంబంధం ఉన్నది” అని కోర్టు స్పష్టం చేసింది. తమ ఆదేశాలకు వ్యతిరేకంగా ఎలాంటి పిటిషన్లు విచారించబోమని తేల్చి చెప్పింది. జంతు ప్రేమికులు, ఇతర సంస్థలు ఈ చర్యలను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే వారి మీద కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ఈ విచారణ సమయంలో సుప్రీం కోర్టు మరో అంశాన్ని కూడా ప్రస్తావించింది. పురుషులకు మాత్రమే పోస్టులు రిజర్వ్ చేయడాన్ని ప్రశ్నిస్తూ ఆర్మీ నియామకాలపై అసంతృప్తి వ్యక్తం చేసింది. అయితే ప్రస్తుతం ప్రధానంగా వీధికుక్కల సమస్యపై దృష్టి పెట్టిన కోర్టు, వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. వీధికుక్కల తరలింపునకు సంబంధించి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సమాధానం ఇచ్చారు. షెల్టర్ల కోసం ఢిల్లీలో ఇప్పటికే ఒక ప్రదేశాన్ని గుర్తించామని, కానీ జంతు హక్కుల కార్యకర్తలు స్టే ఆర్డర్ తెచ్చుకోవడంతో ప్రాజెక్ట్ నిలిచిపోయిందని వివరించారు.
దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన జస్టిస్ పార్దివాలా ఆ జంతు ప్రేమికులందరూ కలిసి రేబిస్‌తో చనిపోయినవారిని తిరిగి తీసుకురాగలరా? అని ఘాటుగా ప్రశ్నించారు. వీధికుక్కల తరలింపుతో పాటు వాటిని ఎవరైనా దత్తత తీసుకోవాలన్న యత్నాలు చేస్తే కూడా అనుమతి ఇవ్వొద్దని కోర్టు ఆదేశించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల భద్రతే అత్యవసరం. అందువల్ల వీధికుక్కలకు తక్షణమే ప్రత్యేక షెల్టర్లను నిర్మించాలి. దీనిపై మరింత ఆలస్యం అసహనాన్ని పెంచుతుంది అని కోర్టు అధికారులను హెచ్చరించింది. ఇప్పటికే ఢిల్లీలో రేబిస్ కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. వీధుల్లో నిత్యం చలిస్తున్న కుక్కల బెడదతో ప్రజలు భయంతో జీవిస్తున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు జారీ చేసిన ఆదేశాలు ప్రజలలో భద్రతా భావం పెంచే దిశగా ఉన్నాయని చెప్పొచ్చు. ఈ నిర్ణయం త్వరగా అమలవుతోందా లేదా అనేది అధికారుల చర్యలపై ఆధారపడి ఉంటుంది.
Read Also: Mass Jathara : ‘మాస్ జాతర’ టీజర్ టాక్..ఇక జాతర జాతరే