Site icon HashtagU Telugu

Supreme Court : బీజేపీకి షాక్.. ఆ నగరం మేయర్‌ను మార్చేసిన సుప్రీంకోర్టు

Supreme Court

Supreme Court

Supreme Court : సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. చండీగఢ్ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్‌గా ఇటీవల ఎన్నికైన బీజేపీ నేత మ‌నోజ్ సోంక‌ర్‌ను పదవి నుంచి తప్పిస్తున్నట్లు వెల్లడించింది. అక్రమంగా ఎన్నికైనందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది.  కొత్త మేయర్‌గా ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి కుల్దీప్ కుమార్‌ పేరును అనౌన్స్ చేసింది. చండీగఢ్ మేయర్ ఎన్నికలో రిటర్నింగ్ అధికారి అనిల్ మసీహ్ అవకతవకలకు పాల్పడ్డారంటూ దాఖలైన పిటిషన్‌‌ను సీజేఐ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం మంగళవారం మరోసారి విచారించింది.  గత నెలలో జరిగిన చండీగఢ్ మేయర్ ఎన్నిక ఫలితాలు చెల్లవని సుప్రీంకోర్టు ప్రకటించింది. ఎన్నికల రిటర్నింగ్ అధికారి అనిల్ మసీహ్ చట్ట విరుద్దంగా వ్యహరించారని వెల్లడించింది. ఆయన ఉద్దేశపూర్వకంగానే 8 బ్యాలెట్ పేపర్లను కొట్టివేశారని మండిపడింది.

We’re now on WhatsApp. Click to Join

సోమవారం రోజు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు చండీగఢ్ మేయర్ ఎన్నికకు సంబంధించిన బ్యాలెట్ పేపర్లను మంగళవారం ఉదయం కోర్టులో సమర్పించారు. ఆ వెంటనే వాటిని సుప్రీంకోర్టు పర్యవేక్షణలో రీకౌంట్ చేశారు. రిటర్నింగ్‌ అధికారి చెల్లని ఓట్లుగా ప్రకటించి పక్కకు పెట్టిన ఆమ్‌ ఆద్మీ పార్టీకి చెందిన ఎనిమిది బ్యాలెట్‌ పేపర్లను కూడా లెక్కించాలని ఆదేశించింది. ఈ మేరకు చెల్లుబాటు కాని 8 బ్యాలెట్‌ పత్రాలను సుప్రీంకోర్టు పరిశీలించింది. దాని ప్రకారం అత్యధిక ఓట్లు వచ్చిన అభ్యర్థిని చండీగఢ్ మేయర్‌గా ప్రకటించాలని తెలిపింది. తాజాగా ఆప్‌ అభ్యర్థి కుల్దీప్‌ కుమార్‌ను చండీగఢ్‌ మేయర్‌గా ప్రకటించడంతో ఈవివాదానికి తెరపడింది.

Also Read : PM Modi – AP : అటు ఏపీ.. ఇటు తెలంగాణ.. ప్రధాని మోడీ వర్చువల్ ప్రారంభోత్సవాలివే

 జ‌న‌వ‌రి 30న జ‌రిగిన చండీగఢ్ మేయర్ ఎన్నిక‌ల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన కుల్దీప్ క‌మార్‌ను ఓడించి బీజేపీ నేత మనోజ్‌ సోంకర్‌  మేయ‌ర్‌గా గెలుపొందారు. అప్పట్లో బీజేపీకి 16 ఓట్లు రాగా.. కాంగ్రెస్, ఆప్‌ కూటమికి చెందిన ఉమ్మ‌డి అభ్య‌ర్ధి కుల్దీప్ సింగ్‌కు 12 ఓట్లు వచ్చాయి. ఆప్‌ అభ్యర్థికి వచ్చిన 8 ఓట్లు చెల్లవని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి అనిల్‌ మసీహ్‌ ప్రకటించారు. దీంతో బీజేపీ అభ్యర్థి మ‌నోజ్ సోంక‌ర్ విజయం సాధించారు. ఈ క్రమంలో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి అనిల్‌ మసీహ్‌  బ్యాలెట్‌ పత్రాలను తారుమారు చేసిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. బ్యాలెట్‌ పేపర్లను మార్కింగ్‌ చేస్తూ రిటర్నింగ్‌ అధికారి అనిల్‌ మసీహ్‌ కెమెరాకు చిక్కారు. దీంతో ఆప్‌ కౌన్సిలర్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆప్ కౌన్సిలర్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు తాజా తీర్పును వెలువరించింది.