Shocking Facts : జైపూర్‌లో నాలుగో తరగతి విద్యార్థిని ఆత్మ*హత్య కేసు.. వెలుగులోకి షాకింగ్ నిజాలు!

రాజస్థాన్‌లోని జైపూర్‌లో నాలుగో తరగతి విద్యార్థిని పాఠశాల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. తోటి విద్యార్థుల వేధింపులే కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. స్కూల్‌కు వెళ్లనని ఆ పాప ఏడుస్తున్న ఆడియో ఒకటి తాజాగా బయటపడింది. సీబీఎస్‌ఈ నివేదికలో ఏడాదిన్నరగా వేధింపులు, టీచర్ల నిర్లక్ష్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. సీసీటీవీలో పాప చివరి క్షణాల్లో కలవరపడటం కనిపించింది. అయితే, చిన్నారి సహాయం కోసం అర్ధించినా.. టీచర్ పట్టించుకోలేదు. రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌లోని ప్రముఖ […]

Published By: HashtagU Telugu Desk
Student Suicide Case

Student Suicide Case

రాజస్థాన్‌లోని జైపూర్‌లో నాలుగో తరగతి విద్యార్థిని పాఠశాల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. తోటి విద్యార్థుల వేధింపులే కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. స్కూల్‌కు వెళ్లనని ఆ పాప ఏడుస్తున్న ఆడియో ఒకటి తాజాగా బయటపడింది. సీబీఎస్‌ఈ నివేదికలో ఏడాదిన్నరగా వేధింపులు, టీచర్ల నిర్లక్ష్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. సీసీటీవీలో పాప చివరి క్షణాల్లో కలవరపడటం కనిపించింది. అయితే, చిన్నారి సహాయం కోసం అర్ధించినా.. టీచర్ పట్టించుకోలేదు.

రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌లోని ప్రముఖ స్కూల్‌లో నాలుగో తరగతి చదువుతోన్న విద్యార్ధిని పాఠశాల భవనంపై నుంచి దూకి నవంబరు 1న ఆత్మహత్యకు పాల్పడిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా, ఈ కేసులో సంచలన వాస్తవాలు బయటపడ్డాయి. తోటి విద్యార్థుల వేధింపుల కారణంగానే తమ కుమార్తె చనిపోయిందని ఆ చిన్నారి తల్లిదండ్రులు ఆరోపించారు. తాను స్కూల్‌కు వెళ్లనంటూ ఆ పాప ఏడుస్తున్న ఆడియోను విద్యార్థిని తల్లి మీడియాతో పంచుకున్నారు. ‘నేను స్కూల్‌కు వెళ్లాలనుకోవడం లేదు.. నన్ను పంపించొద్దు అమ్మా ప్లీజ్‌’ అని చిన్నారి అందులో వేడుకోవడం రికార్డయ్యింది.

బాలిక తల్లి శివాని మీనా మాట్లాడుతూ.. ‘‘దీనిని క్లాస్‌ టీచర్‌తో పాటు కో-ఆర్డినేటర్‌కు పంపి చాలాసార్లు మాట్లాడాను. అయినా మా ఆవేదనను వాళ్లు వినిపించుకోలేదు.. ఏడాదిన్నరగా స్కూల్‌లో నా బిడ్డను ఆటపట్టించడం, బెదిరించడం, లైంగిక వేధింపులకు గురిచేయడం వంటివి జరిగాయి’’ అంటూ ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. మా పాపకు మరో అబ్బాయిని ఉద్దేశిస్తూ తోటి విద్యార్థులు ఏడిపించారని ఆ బాలిక తండ్రి ఆరోపించారు.

ఈ ఘటనపై సీబీఎస్‌ఈ నివేదికలో ఏడాదిన్నరగా వేధింపులకు గురైనట్టు పేర్కొన్నారు. కానీ క్లాస్ టీచర్ పునీతా శర్మకు తల్లిదండ్రులు పదేపదే ఫిర్యాదు చేసినప్పటికీ వాటిని నిర్లక్ష్యం చేసినట్లు తెలిపారు.

బాలిక ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై దృష్టి పెట్టిన నివేదిక ప్రకారం.. చిన్నారి మరణానికి ముందు కొద్ది గంటల ముందు సరదాగా మాట్లాడుతూ డ్యాన్స్ చేస్తూ, చాక్లెట్ తింటూ సంతోషంగా నవ్వుతూ కనిపించింది. కానీ ఉదయం 11 గంటల తర్వాత పరిస్థితి మారినట్లు సీసీటీవీ వీడియోలో కనిపించింది. డిజిటల్ స్లేట్‌పై ఉన్న కంటెంట్‌ చూసి ఆమె అసహజంగా కలవరపడినట్లు రికార్డైంది. అబ్బాయిలు ఏదో రాయడంతో ఆమె గందరగోళంగా, ఆశ్చర్యంగా ఉందని, స్లేట్‌పై రాతలను ఆపాలని లేదా చెరపాలని ఆమె తోటి విద్యార్థులను కోరుతున్నట్లు కూడా కనిపించింది.

చిన్నారి కూడా స్లేట్‌పై ఏదో రాసి చెరిపేయాలని కోరింది. ‘ఆ సమయంలో టీచర్‌ జోక్యం తప్పనిసరిగా అవసరం ఉండేది’” అని సీబీఎస్‌ఈ అభిప్రాయపడింది.
క్లాస్ టీచర్‌ సహకరించలేదని, ఐదుసార్లు ఆమెను సంప్రదించి, మొత్తం 45 నిమిషాల పాటు సహాయం కోరినా, ఎలాంటి సహాయం అందించలేదని నివేదికలో పేర్కొంది.

నవంబరు 1న పాఠశాల భవనంపై నుంచి బాలిక దూకడంతో తీవ్రంగా గాయపడింది. ఆమెను ఆస్పత్రికి తరలించే లోపే చనిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి. సమాచారం తెలిసి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేసరికే.. అక్కడ రక్తపు మరకలు మాయమయ్యాయి. దీంతో ఆమె మరణంపై అనుమానాలు వ్యక్తం కాగా.. పాఠశాల యాజమాన్యంపై బాధిత కుటుంబం కేసు పెట్టారు.

  Last Updated: 21 Nov 2025, 02:09 PM IST