Shubhanshu Shukla : భారత అంతరిక్ష చరిత్రలో ఒక కీలక ఘట్టం నేడు ఆవిష్కృతమైంది. భారతీయుల ఆశలతో నిండి, శుభాకాంక్షలతో మెరుస్తూ భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్షంలోకి ప్రవేశించారు. అమెరికా వాణిజ్య అంతరిక్ష సంస్థ యాక్సియం స్పేస్ చేపట్టిన యాక్సియం-4 మిషన్ లో భాగంగా ఆయన మరో ముగ్గురు వ్యోమగాములతో కలిసి వ్యోమనౌక ద్వారా రోదసిలోకి పయనమయ్యారు. ఈ మిషన్‌ను అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి బుధవారం మధ్యాహ్నం 12:01 (భారత కాలమానం ప్రకారం) ప్రారంభించారు. ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ప్రయోగించిన ఈ వ్యోమనౌక విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. వాస్తవానికి ఈ ప్రయోగం మే 29న జరగాల్సి ఉన్నప్పటికీ, వాతావరణ సమస్యలు, సాంకేతిక అడ్డంకుల కారణంగా అనేకసారి వాయిదా పడింది. చివరకు బుధవారం నాడు కొన్ని తుదిమినట్లు సవాళ్లను అధిగమించి విజయం సాధించింది.
Read Also: PM Modi : నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది: ప్రధాని మోడీ
ఈ మిషన్‌లో శుభాంశు శుక్లా మిషన్ పైలట్‌గా కీలక భాద్యతలు నిర్వహిస్తున్నారు. అంతరిక్షంలో ఆయనను ‘శుక్స్’ అనే పిలుపుతో పిలుస్తున్నారు. ఆయనతో పాటు మిషన్ కమాండర్ పెగ్గీ విట్సన్ (అమెరికా), స్పెషలిస్టులు టిబర్ కపు (హంగరీ), స్లావోస్జ్ ఉజ్నాన్స్‌కీ (పోలండ్) రోదసిలోకి వెళ్లారు. ఈ వ్యోమయానం సుమారు 28 గంటల ప్రయాణం తర్వాత భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) చేరుకోనుంది. గురువారం సాయంత్రం 4:30 (భారత కాలమానం ప్రకారం)న ISSతో అనుసంధానం అవుతుందని అంచనా. అక్కడ ఈ బృందం 14 రోజులు గడుపుతారు.
ఈ ప్రయాణంలో భాగంగా శుభాంశు, ఇస్రో తరఫున ఏడు కీలక శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహిస్తారు. ఇవి ప్రధానంగా పొడవైన అంతరిక్ష యాత్రల్లో జీవనాధార వ్యవస్థలు, పోషణ, శరీర సంబంధిత మార్పులపై దృష్టి సారిస్తాయి. భారరహిత స్థితిలో ఎముకల మందగింపు, కండరాల తగ్గుదల, గుండె పనితీరు, రోగనిరోధక వ్యవస్థలపై పరిశోధనలు జరుగుతాయి. వీటితోపాటు నాసా నిర్వహించే ఐదు ఉమ్మడి అధ్యయనాల్లో కూడా ఆయన పాల్గొంటారు. ఈ మిషన్‌లో మొత్తం 31 దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు 60 ప్రయోగాలు నిర్వహించనున్నారు. ఒకే మిషన్‌లో ఇంత విస్తృత ప్రయోగాలు జరగడం ఇదే తొలిసారి కావడం విశేషం.
శుభాంశు అనుభవం గగన్‌యాన్ మిషన్‌కు కీలకంగా మారనుంది. భారత తొలి మానవసహిత అంతరిక్ష యాత్రగా 2027లో చేపట్టే గగన్‌యాన్‌కు శుభాంశు అనుభవం మార్గదర్శకంగా నిలవనుంది. ఈ ప్రయోగం ద్వారా 41 ఏళ్ల విరామం తర్వాత మరో భారతీయుడు రోదసిలో అడుగుపెడుతున్న సందర్భం సంబరంగా మారింది. చివరిసారిగా 1984లో రాకేశ్ శర్మ సోవియట్ యూనియన్‌తో కలిసి రోదసికి వెళ్లారు. ఆ తర్వాత ఇదే తొలిసారి భారత పౌరుడు రోదసిలో పయనిస్తున్నాడు. ఈ మిషన్ ద్వారా భారత్ అంతరిక్ష రంగంలో మరో కీలక మైలురాయిని అధిగమించింది. ఇది మన దేశానికి గర్వకారణం మాత్రమే కాక, భవిష్యత్తులో మరింత ఆధునిక అంతరిక్ష ప్రయోగాలకు బీజంగా నిలవనుంది.
Read Also: Bandi Sanjay : ఎమర్జెన్సీ పాలన చీకటి అధ్యాయం : బండి సంజయ్