Site icon HashtagU Telugu

Shubhanshu Shukla : లక్నో చేరిన శుభాన్షు శుక్లా..ఎయిర్‌పోర్ట్‌లో ఘనంగా స్వాగతం

Subhanshu Shukla arrives in Lucknow, receives grand welcome at the airport

Subhanshu Shukla arrives in Lucknow, receives grand welcome at the airport

Shubhanshu Shukla : భారత అంతరిక్ష రంగంలో చారిత్రాత్మక ఘట్టంగా నిలిచే ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తిచేసిన భారత వాయుసేన (ఐఏఎఫ్) గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా సొంత గడ్డపై అడుగుపెట్టారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్‌)లో 18 రోజుల సుదీర్ఘ మిషన్‌ పూర్తి చేసి, పునరావాసం అనంతరం ఆగస్టు 17న భారత్‌కు చేరుకున్న ఆయనకు లక్నో విమానాశ్రయంలో ప్రజల నుండి అపూర్వ స్వాగతం లభించింది. సోమవారం ఆయన లక్నో ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన వెంటనే వందలాది మంది ప్రజలు, విద్యార్థులు, కుటుంబ సభ్యులు, అధికారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. శుభాన్షు శుక్లా పేరు నినదిస్తూ, త్రివర్ణ పతాకాలను ఊపుతూ, జేజేలు పలుకుతూ ఎంతో ఉత్సాహంగా స్వాగతం పలికారు. ఈ సందర్బంగా ఎయిర్‌పోర్ట్ పరిసరాల్లో పండుగ వాతావరణం నెలకొంది.

Read Also: TDP : జగన్ పరిపాలన రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో వెనక్కి నెట్టింది: యనమల

ఈ కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బ్రజేష్ పాఠక్ స్వయంగా హాజరయ్యారు. శుక్లాను అభినందిస్తూ మీడియాతో మాట్లాడుతూ..భారత ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో అంతరిక్ష రంగం సరికొత్త శిఖరాలను అధిరోహిస్తోంది. శుభాన్షు శుక్లా వంటి సైనికుడు అంతరిక్షంలో దేశ కీర్తిని ప్రతిధ్వనించడం ఎంతో గర్వకారణం. ఆయన ప్రస్థానం యువతకు స్ఫూర్తిదాయకం. ఉత్తరప్రదేశ్ గర్వించాల్సిన ఘనత ఇది అని కొనియాడారు. శుక్లా గౌరవార్థంగా రాష్ట్ర ప్రభుత్వం పలు కార్యకలాపాలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. శుభాన్షు శుక్లా కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. మా కుమారుడు అంతరిక్షంలో దేశ ప్రతిష్ఠను నిలబెట్టాడు. ఇది మా కుటుంబానికి ఓ గర్వకారణం మాత్రమే కాదు దేశానికే ఒక గొప్ప మైలురాయి అని వారు వ్యాఖ్యానించారు.

శుక్లా చదివిన పాఠశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఎయిర్‌పోర్టుకు చేరుకొని స్వాగతం పలికారు. శుభాన్షు శుక్లా గారిలాగే మేం కూడా దేశానికి సేవ చేయాలనుకుంటున్నాం అని ఒక విద్యార్థి తన ఆకాంక్షను వెల్లడించాడు. మరో విద్యార్థి మాట్లాడుతూ.. అలాంటి గొప్ప వ్యక్తి మా స్కూల్‌ నుంచే వచ్చారనడం మాకెంతో గర్వంగా ఉంది అని పేర్కొన్నాడు. గత జూన్‌లో యాక్సియమ్ మిషన్-4లో భాగంగా శుభాన్షు శుక్లా, అమెరికా ప్రైవేట్ స్పేస్‌ కంపెనీ యాక్సియమ్ స్పేస్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ భాగస్వామ్యంతో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. 18 రోజుల పాటు అక్కడ ఆయన ఇస్రో ఆధ్వర్యంలో కీలకమైన శాస్త్రీయ ప్రయోగాల్లో పాల్గొన్నారు. ఆయన అనుభవం భారత్ చేపట్టబోయే గగన్‌యాన్ మిషన్‌కు ఎంతో కీలకంగా మారుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జులై 15న భూమికి విజయవంతంగా తిరిగొచ్చిన అనంతరం అమెరికాలో పునరావాస కార్యక్రమాలు పూర్తి చేసుకున్న శుక్లా, ఆగస్టు 17న భారత్‌కి చేరుకుని ప్రధాని నరేంద్ర మోడీని కలిసి తన అనుభవాలను పంచుకున్నారు. భారత్ అంతరిక్ష విజ్ఞానంలో అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో, శుక్లా మిషన్ దేశానికి ప్రేరణగా నిలిచింది.

Read Also: Rekha Gupta : ఢిల్లీ సీఎం పై దాడి..దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు