Site icon HashtagU Telugu

Internal Security System: దేశ రాజధాని అంతర్గత భద్రతా వ్యవస్థ బలోపేతం దిశగా చర్యలు!

Internal Security System

Internal Security System

Internal Security System: దేశ రాజధాని ఢిల్లీని మరింత భద్రతగా, ప్రశాంతంగా మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. అందులో భాగంగానే రూ.54 కోట్ల వ్యయంతో పోలీసు భవన ప్రాజెక్టులను నిర్మించినట్లు చెప్పారు. ఈరోజు న్యూఢిల్లీలో నూతనంగా నిర్మించిన 8 పోలీసు భవన ప్రాజెక్టులను (Internal Security System) కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బండి సంజయ్ తోపాటు ఢిల్లీ పోలీస్ కమిషనర్ సంజయ్ అరోరా, సీనియర్ అధికారులు గరీమ భట్నాగర్, అతుల్ కాత్యార్, దివేశ్ చంద్ర శ్రీవాస్తవ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ…ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో హోంమంత్రి అమిత్ షా మార్గదర్శకత్వంలో ఒకే గొడుగు పథకం (Umbrella Scheme)కింద కింద రూ.4031 కోట్ల వ్యయంతో కొత్తగా 66 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపిందన్నారు. అందులో భాగంగా ఈ రోజు నూతనంగా నిర్మించిన 8 నూతన భవన ప్రాజెక్టుల ప్రారంభోత్సవ సందర్భంలో మీతో పాటు పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. జాతీయ రాజధానిలో అంతర్గత భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో కీలకంగా మారతాయన్నారు.

Also Read: Dhruv Jurel: టీమిండియాకు గుడ్ న్యూస్‌.. పంత్ స్థానంలో జ‌ట్టులోకి వ‌చ్చిన కీల‌క ఆట‌గాడు!

అత్యవసరమైన అన్ని సేవలతోపాటు నీటి సరఫరా, కాలువ (సీవరేజ్), విద్యుత్, టెలిఫోన్, అగ్నిమాపక వ్యవస్థ సేవలన్నీ పూర్తిగా అమలవుతాయని పేర్కొన్నారు. దీంతోపాటు రహదారులు, తోటల అభివృద్ధి, వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థలు, సోలార్ ప్యానెళ్లు, మరియు ఆధునిక మురుగు శుద్ధి ప్లాంట్లు వంటి పర్యావరణహిత సదుపాయాలు కూడా ఈ భవనాలలో ఏర్పాటు చేయబడ్డాయన్నారు. పర్యావరణ ప్రభావాన్ని తగ్గించడంలో ఎంతో దోహదపడతాయన్నారు. పోలీస్ స్టేషన్లు, పోలీస్ హౌసింగ్ రీడెవలప్‌మెంట్ ప్రాజెక్టులు, ఆఫీస్ భవనాల నిర్మాణం మొదలైనవన్నీ ఇందులో ఉన్నాయని వివరించారు. ఈ ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేయడంలో కృషి చేసిన ఢిల్లీ పోలీస్, లోక్ నిర్మాణ విభాగం, గృహ మంత్రిత్వ శాఖ అధికారులందరికీ కేంద్ర మంత్రి అభినందనలు తె లిపారు. ప్రభుత్వ సుసంపన్న పాలన, స్పష్టత, ప్రజాసేవ పట్ల ఉన్న అంకితభావానికి ఇవి ప్రతీకగా నిలుస్తాయని చెప్పారు. ఈ భవనాలను కేవలం నిర్మాణమైన కట్టడాలుగా మాత్రమే భావించవద్దని, ఇక్కడి నుంచే పోలీస్ చౌకీలు, పోలీస్ స్టేషన్లు, క్రైమ్ బ్రాంచ్ ఫింగర్‌ప్రింట్ బ్యూరో, అలాగే స్పెషల్ సెల్ కార్యకలాపాలు నిర్వహించబడతాయని తెలిపారు.

పోలీస్ బలగాల పనితీరుతోపాటు ఢిల్లీలో న్యాయవ్యవస్థ, ప్రజల భద్రత కూడా మరింత బలపడతాయని అభిప్రాయపడ్డారు. ఫింగర్ ప్రింట్ బ్యూరో, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, కె9 స్క్వాడ్ (డాగ్ స్క్వాడ్), ఫోరెన్సిక్ యూనిట్లకు సంబంధించి ఆధునిక సాంకేతికత, ప్రత్యేక నైపుణ్యం ఆధారంగా శాంతి, భద్రత మరియు చట్ట నిర్వహణను బలోపేతం చేస్తాయని తెలిపారు. అత్యవసర పరిస్థితులు, ప్రమాదాల గుర్తింపు, క్లిష్టమైన నేరాల దర్యాప్తు వంటి సందర్భాల్లో ఈ యూనిట్ల పాత్ర అత్యంత కీలక పాత్ర పోషిస్తాయన్నారు.