Starvation : పసివాడి ప్రాణం తీసిన ఆకలి…

లోధా షబర్ (Lodha Shabar) అనే గిరిజన జాతికి చెందిన ఈ కుర్రవాడు ఆకలితో (Starvation) ఎన్నాళ్ళ నుంచి ఉన్నాడో తెలియదు.

  • Written By:
  • Updated On - September 30, 2023 / 11:15 AM IST

By: డా. ప్రసాదమూర్తి

Starvation took the life of a baby :  అనగనగా ఒక పిల్లవాడు. పది పన్నెండేళ్ళ పసివాడు. ఆకలికి (Starvation), ఆహారానికి సంబంధం తెలియనివాడు. ఆకలేస్తే అన్నం తినాలన్న ఆలోచనే తప్ప, కళ్ళ ముందు కనిపించే ఆహార పదార్థాల చుట్టూ అనేక ఆంక్షల ముళ్ళ కంచెలున్నాయన్న జ్ఞానం లేని వాడు. కనిపించే పదార్థాలను కడుపు కట్టుకొని అలా చూస్తూ ఉండాలి తప్ప, వాటిని ముట్టుకోకూడదన్న తెలివి లేనివాడు. ఆకలేసిందని కనిపించిన ఒక ఆహార పదార్థాన్ని తీసుకుని కడుపు నింపుకున్నాడు. అదే అతను చేసిన పాపం. ఆ పాపమే అతనికి శాపమైంది. అతని పసి జీవితాన్ని కాటు వేసింది. తాను ఏం చేశాడో.. ఏం జరిగిందో తెలియకుండానే అనంత లోకాల్లోకి వెళ్లిపోయాడు. కడుపు నింపాల్సిన ఆహార పదార్ధం కాటికి పంపుతుందన్న ఎరుక లేనివాడు. పాపం పసివాడు. అతని పేరు శుభా నాయక్. ఎక్కడో పశ్చిమబెంగాల్లో మిడ్నపూర్ జిల్లాలో ఒక గ్రామంలో జరిగిన ఘటన ఇది.

లోధా షబర్ (Lodha Shabar) అనే గిరిజన జాతికి చెందిన ఈ కుర్రవాడు ఆకలితో (Starvation) ఎన్నాళ్ళ నుంచి ఉన్నాడో తెలియదు. బుధవారం నాడు తనకు ఎదురుగా కనిపించిన ఒక ఫుడ్ స్టాల్ నుంచి ఒక ఆహార పదార్థాన్ని దొంగలించి తిన్నాడన్న ఆరోపణతో ఆ స్టాల్ యజమాని గగ్గోలు పెట్టి గోల చేశాడు. అంతే అక్కడ ఉన్న స్థానిక రాజకీయ నాయకుడు ఉగ్రరూపం దాల్చాడు. తృణమూల్ కాంగ్రెస్ కి చెందిన మనోరంజన్ మాల్ ఆ నాయకుడు. ఆ చుట్టుపక్కల ఉన్న జనాన్ని రెచ్చగొట్టాడు. ఈ లోధా షబర్ (Lodha Shabar) గిరిజన జాతికి చెందిన వాళ్లంతా దొంగలేనని, వాళ్లకి తగిన బుద్ధి చెప్పాలని, కొట్టండి కొట్టండి అని ప్రజల్ని రెచ్చగొట్టాడు ఆ స్థానిక నాయకుడు. అంతే, ఆవేశం తప్ప ఆలోచనలేని జనాలు కుర్రవాన్ని పట్టుకొని ఒక గదిలోకి లాక్కొచ్చి తలుపులు వేసి దారుణంగా సామూహికమైన దాడి చేసి హింసించి అతని ప్రాణాలు తీసేశారు. ఆ కుర్రవాడిపై జరిగిన సామూహిక దాడిలో ఆ స్థానిక తృణమూల్ నాయకుడు స్వయంగా పాల్గొన్నాడు. అతని కాలితో ఆ కుర్రవాడిని ఎంత కిరాతకంగా తన్నాడో విషయం అంతా బయటకు పొక్కింది. ఈ వార్త పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని అంతా కుదిపివేసింది. అది దేశానికంతటికీ దావానలంలా పాకింది. ఏది తనది, ఏది పరాయిది తెలుసుకునే జ్ఞానం లేని పసిప్రాణాన్ని ఇలా ముకుమ్మడిగా బలి తీసుకున్న ఘోరకలి దేశాన్ని మొత్తాన్ని కలచివేసింది.

ఎందుకిలా జరిగింది? ఏమై ఉంటుంది అన్న ఆరాలు తీస్తే ఒక విషయం బయటకు వచ్చింది. గత స్థానిక ఎన్నికల్లో ఈ గిరిజన జాతి వాళ్లు అధికార పార్టీకి ఓట్లు వేయలేదట. వారి మీద ఏ రూపంలో కక్ష తీర్చుకోవాలా అని ఎదురుచూస్తున్న స్థానిక టీఎంసీ నాయకులకు ఈ సాకు దొరికింది. ఈ విషయాన్ని ఆ గిరిజన జాతి వారు బహిరంగంగానే ఇప్పుడు చెప్తున్నారు. అయితే దీన్ని మసిపూసి మారేడు కాయ చేయడానికి, ఆ కుర్రవాడు విషం తాగి చనిపోయాడని కొందరు ప్రచారం చేస్తున్నారు. శుభా నాయక్ తల్లి ఎంత తల్లడిల్లి పోయిందో. ఆమె అన్న మాటలు ఈ దేశంలో నిరుపేదల నిస్సహాయ స్థితికి అద్దం పడుతున్నాయి. “పండించుకోవడానికి మాకు భూమి లేదు. బ్రతకడానికి మార్గం లేదు. తినడానికి తిండి లేదు. మేము చచ్చిపోవడానికి విషమే తాగాలా? నాయకులు మా జాతిని మటుమాయం చేయడానికి ఇలా పన్నాగాలు పన్నుతున్నారు.” అని ఆ తల్లి ఆక్రోశించింది. ఈ ఆవేదన ఒక తల్లిది కాదు. అనాగరికమైన జీవితాలను, అసహాయమైన జీవితాలను, నాగరికతకు దూరంగా కొనసాగిస్తున్న కోట్లాది గిరిజనుల కన్నీటి ఘోష ఇది. ఈ అమానుషమైన ఘటనను స్థానిక మంత్రి మానస రంజన్ ధోనియాకు గిరిజనులు విన్నవించుకున్నారు. దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటామని ఆయన ఏదో కంటి తుడుపుగా ఒక మాట చెప్పి వదిలేశారు.

లోధా షబర్ (Lodha Shabar) గిరిజన జాతిని దేశంలో అత్యంత దయనీయంగా బతికే 75 గిరిజన జాతులలో ఒకటిగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. 1992లో చునీ కోతల్ అనే యువతి ఈ జాతిలో తొలిసారిగా గ్రాడ్యుయేషన్ వరకు చదువుకుంది. అయితే ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఈ విషయం 1994లో బెంగాలీ రచయిత్రి మహాశ్వేతా దేవి కథగా రాసినప్పుడు మాత్రమే బయట ప్రపంచానికి తెలిసింది. ఇలా ఒక బాలుడి కథ కాదు.. ఒక బాలిక కథ కాదు.. దేశమంతా ఆసేతు హిమాచలం భూమిలేని, బతకడానికి చిన్న ఆధారం కూడా లేని నిస్సహాయ గిరిజన జీవితాలు అనేకం. దేశమంతా ఇదే అణచివేత. శుభా నాయక్ అనే ఈ కుర్రవాడి ఘటనతో కనీసం ఇప్పటికైనా కోట్లాది గిరిజనుల నిస్సహాయ జీవితాలు ఉద్ధరించడానికి ప్రభుత్వాలు ఒక ఖచ్చితమైన నిజాయితీగా కూడిన చట్టాలు తీసుకువస్తారని, వాటిని భద్రంగా అమలు చేస్తారని ఆశించడం తప్ప మామూలు మనుషులం మనం ఏం చేయగలం?.

Also Read:  YCP : తిరుప‌తి వైసీపీ నేత‌ల‌తో ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి స‌మావేశం.. అన్ని స్థానాలు గెలుచేందుకు ప్ర‌ణాళిక చేయాల‌ని ఆదేశం