భారతీయ రైల్వేస్టేషన్లలో తొక్కిసలాట (Stampedes ) ఘటనలు ప్రయాణికులను ఖంగారుకు గురిచేస్తున్నాయి. గుంపులు ..గుంపులుగా ప్రయాణాలు చేయడం, రద్దీ ఎక్కువగా ఉండే వేళల్లో అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వంటి కారణాలతో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఘోర తొక్కిసలాటలో 18 మంది మరణించటం దేశవ్యాప్తంగా ఆందోళన రేకెత్తించింది. ప్రత్యేకించి ప్రయాగ్‌రాజ్ కుంభమేళాకు వెళ్లే భక్తులు భారీగా స్టేషన్‌కు చేరుకోవడం, ఆలస్యం జరిగిన రైళ్లతో కలిసిన జన సందోహం ఈ విషాదానికి దారితీసింది.
Water Supply: హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. రేపు, ఎల్లుండి ఈ ప్రాంతాల్లో వాటర్ కట్!
ఇలాంటి తొక్కిసలాటలు కొత్తవి కావు. గతంలో కూడా రద్దీ ఎక్కువగా ఉండే పండగల సమయంలో, వేడుకల సమయంలో రైల్వేస్టేషన్లలో ఇటువంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. 2017లో ముంబయి ఎల్ఫిన్‌స్టోన్ స్టేషన్‌లో జరిగిన ప్రమాదంలో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతకు ముందు 2013లో అలహాబాద్ రైల్వే స్టేషన్‌లో కుంభమేళా సమయంలో జరిగిన తొక్కిసలాటలో 36 మంది మృతి చెందారు. వీటన్నింటికీ ప్రధాన కారణం అనేక మంది ప్రయాణికులు ఒకే చోట కిక్కిరిసి ఉండటం, సరైన మార్గదర్శకాలు లేకపోవడం. పండగల సీజన్లో ఎక్కువ మంది ప్రయాణికులు రైల్వేస్టేషన్లకు చేరుతుంటారు. అయితే స్టేషన్ పరిధిలో నియంత్రణ లేకపోవడం, తగిన సౌకర్యాలు లేకపోవడం, రైల్వే అధికారులు సమయానికి సరైన చర్యలు తీసుకోకపోవడం తొక్కిసలాటలకు దారి తీస్తోంది. 2007లో వారణాసి గంగాస్నానం ముగించుకుని మోగల్‌సరాయ్ జంక్షన్‌కు చేరుకున్న భక్తులు అధిక సంఖ్యలో ఉండటంతో తొక్కిసలాట జరిగింది. మళ్లీ ఇదే పరిస్థితి 2004లో ఢిల్లీలో చోటుచేసుకుంది. ప్లాట్‌ఫామ్ మార్చడం వల్ల ప్రయాణికులు తల్లకిందులుగా పరుగులు పెట్టి ప్రాణాలు కోల్పోయారు.
రైల్వే స్టేషన్లలో భద్రతా చర్యలు మరింత కఠినతరం కావాలి. ప్రయాణికుల కదలికలను నియంత్రించే ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి. ప్లాట్‌ఫామ్ల వద్ద అధిక సంఖ్యలో భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేయడం, అదనపు రైళ్లను నడపడం, ప్రయాణికుల కోసం క్లియర్ మార్గాలను ఏర్పాటు చేయడం వంటి చర్యలు తీసుకోవాలి. ఇలాంటి ఘోర ప్రమాదాలను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం, రైల్వే శాఖ మరింత సమర్థవంతమైన విధానాలను అవలంభించాలి. ప్రయాణికుల భద్రతే ప్రధాన లక్ష్యంగా తీసుకుని, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి రద్దీని నియంత్రించే విధంగా చర్యలు తీసుకోవాలి. ప్రయాణికుల అవగాహన పెంచేందుకు ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలి. ఇలా చేస్తే ఇలాంటి ఘటనలు జరగకుండా ఉంటాయి.