Working Hours : దేశంలో గత కొన్ని రోజులుగా పనిగంటలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే ఈ విషయంపై తాజాగా డబ్ల్యూహెచ్‌ఓ మాజీ ప్రధాన శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. క్రమంగా ఎక్కువసేపు పనిచేయడం వల్ల సామర్థ్యం తగ్గుతుందన్నారు. అలసిపోయినప్పుడు శరీరం చెప్పినట్లు వినాలని సూచించారు. మహమ్మారి సమయంలో మేమంతా రెండు-మూడు సంవత్సరాలు చాలా కష్టపడి పనిచేశాం. సరిగ్గా నిద్రపోలేదు. చాలా కాలం పాటు ఒత్తిడికి గురయ్యాం. కొందరైతే నిరంతరం శ్రమించారు. వారి పట్ల చాలా ఆందోళన చెందాం. చివరకు చాలా మంది శ్రమించి అలసిపోయి ఏకంగా వృత్తులనే విడిచిపెట్టారు అని స్వామినాథన్ అన్నారు. మానసిక విశ్రాంతి అనేది పని చేయడానికి చాలా అవసరమన్నారు.
Read Also: Telangana Congress: ‘జై బాపు.. జై భీమ్.. జై సంవిధాన్’ సమన్వయ కమిటీ
బాగా శ్రమించి అలసిపోతే శరీరం మీకు చెబుతుంది. చాలా మంది సమయం తెలియకుండా కష్టపడి పనిచేస్తారని నాకు తెలుసు. అయితే, అది వాళ్ల వ్యక్తిగత విషయం. శరీరం చెప్పినట్లు వినాలి. స్వల్పకాలం పాటు అధికంగా పనిచేయడం అనేది సాధ్యమే. కోవిడ్-19 సమయంలో అలానే చేశాం. అయితే దీర్ఘకాలంపాటు దానిని కొనసాగించడం సరికాదనుకుంటున్నా అన్నారు. ఎన్ని గంటలు పనిచేశాం అనే దానికంటే పని నాణ్యత ఎంత అనేది కీలకమన్నారు. మానవ శరీరానికి నిద్ర అవసరమని తెలిపారు. మెరుగైన ఉత్పాదకతతో ముందుకెళ్లాలన్నా, మెరుగైన ఆలోచనలు అందాలన్నా విరామం అనేది ముఖ్యమని స్వామినాథన్ అన్నారు. మీరు టేబుల్ వద్ద 12 గంటలు నిర్విరామంగా కూర్చోవచ్చు. అయితే, ఎనిమిది గంటల తర్వాత మీరు ఎంత నాణ్యతతో పని చేస్తున్నారో పరిశీలించుకోవాలి అని ఆమె అన్నారు.
కాగా, వారానికి 90 గంటల పాటు పనిచేయాలంటూ ఎల్ అండ్ టి ఛైర్మన్ ఎస్.ఎన్. సుబ్రహ్మణ్యన్ చేసిన వ్యాఖ్యలూ నెట్టింట చర్చకు దారితీశాయి. ప్రపంచ దేశాలతో పోటీ పడాలంటే భారత్‌లోని యువత వారానికి 70 గంటల పాటు పనిచేయాలని ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. వాటిని కొందరు సమర్థించగా.. మరికొందరు వ్యతిరేకించారు.
Read Also: New Scheme : ఏపీలో కొత్త పథకం.. మొదలైన సర్వే