కాంగ్రెస్ చైర్‌పర్సన్ సోనియాగాంధీ (Sonia Gandhi) శనివారం అస్వస్థతకు గురయ్యారు. దీంతో హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో ఉన్న ఇందిరా గాంధీ మెడికల్ కాలేజ్ (IGMC) ఆసుపత్రిలో ఆమెను చేర్పించారు. స్వల్ప ఆరోగ్య సమస్యల నేపథ్యంలో ఆమె సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రిలో చేరారు. ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు మీడియా ముఖ్య సలహాదారు నరేష్ చౌహాన్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. సోనియాగాంధీ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని కూడా ఆయన స్పష్టం చేశారు.
Tummala NageswaraRao : కాళేశ్వరం వివాదంపై తుమ్మల ..అబద్ధాల వలన సత్యం మారదు
78 ఏళ్ల సోనియాగాంధీ ఇటీవల మే 27న దివంగత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ 61వ వర్దంతి సందర్భంగా ప్రజలకు కనిపించారు. అనంతరం సోమవారం ఆమె తన సెలవులను గడపడానికి హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లా చేరుకున్నారు. అక్కడ ఆమె కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రా నివాసమైన ఛరాబ్రాలో నివాసముంటున్నారు. అయితే ఆమె ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించడంతో వెంటనే IGMCకు తరలించారు. అక్కడి ప్రత్యేక వార్డులో ఆమెను చేర్చి తగిన పరీక్షలు చేపట్టారు. సోనియాగాంధీకి రేడియాలజీ విభాగంలో MRI స్కాన్ కూడా నిర్వహించినట్టు తెలుస్తోంది. వైద్య బృందం ఆమె ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోంది. ఇది కేవలం ఒక రొటీన్ చెకప్ మాత్రమేనని, ఆమె ఆరోగ్యం బాగానే ఉందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి. సోనియాగాంధీ త్వరగా కోలుకోవాలని పార్టీ శ్రేణులు ఆశిస్తున్నారు.