India China Border : మంచుకొండల్లోనూ మన దేశం కోసం సైనికులు నిత్యం పహారా కాస్తుంటారు. కంటికి రెప్పలా మన దేశాన్ని వారు కాపాడుతుంటారు. అందుకే దేశ సైనికుల గొప్పతనం గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇటీవలే భారత్ -చైనా బార్డర్‌లో పెట్రోలింగ్ డ్యూటీ చేస్తుండగా ఓ సైనికుడు మంచులో కూరుకుపోయాడు. దాదాపు మూడు రోజుల పాటు ఆ మంచు చరియల్లోనే చిక్కుకొని ఉండిపోయాడు. చుట్టూ ఎముకలు కొరికే చలి వాతావరణంలో ఆ సైనికుడు దాదాపు 72 గంటలు గడపాల్సి వచ్చింది. ఎట్టకేలకు భారత సైన్యం రెస్క్యూ ఆపరేషన్(India China Border) నిర్వహించి ఆ సైనికుడిని కాపాడింది.
Also Read :Salman Khans Father: లారెన్స్ బిష్ణోయ్‌ని పిలుస్తా.. సల్మాన్‌ఖాన్ తండ్రికి మహిళ వార్నింగ్
వివరాల్లోకి వెళితే.. అనిల్ రామ్ బిహార్‌లోని బక్సర్ వాస్తవ్యుడు. ఈయన ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ (ఐటీబీపీ)లో పనిచేస్తున్నాడు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చైనా బార్డర్ వద్దనున్న మున్స్‌యారీ-మిలామ్ ఏరియాలో పెట్రోలింగ్ డ్యూటీ చేస్తుంటారు. మునుపటిలాగే మూడు రోజుల క్రితం కూడా పెట్రోలింగ్ డ్యూటీని అనిల్ రామ్ మొదలుపెట్టారు. అయితే గస్తీ విధులు నిర్వహిస్తుండగా మార్గం మధ్యలో మంచు కారణంగా దారి పూర్తిగా మూసుకుపోయింది. దీంతో అనిల్‌తో పాటు మరో పోర్టర్ దేవేంద్రసింగ్ అక్కడ చిక్కుకుపోయారు. దీంతో అక్కడున్న ఓ గుహలో వారిద్దరు తలదాచుకున్నారు. వీరిద్దరు చిక్కుకున్న ఏరియా మున్స్‌యారీ ప్రాంతానికి 84 కి.మీ దూరంలో ఉంది. దీంతో అనిల్, దేవేంద్ర సింగ్‌లను రక్షించి తీసుకురావడానికి ఆర్మీ ఒక టీమ్‌ను పంపింది. వారిని వెనక్కి తెచ్చే క్రమంలో రెస్క్యూ టీమ్‌కు ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. ఎట్టకేలకు మూడు రోజుల రెస్క్యూ మిషన్ తర్వాత అనిల్, దేవేంద్రలు చిక్కుకున్న ప్రాంతానికి రెస్క్యూ టీమ్ చేరుకుంది. వారిద్దరిని రక్షించి సురక్షిత ప్రదేశానికి తరలించారు. మూడు రోజులుగా ఆహారం లేకపోవడంతో వారిద్దరు కొంత అస్వస్థతకు లోనయ్యారు.
Also Read :Jungle Raj : దళిత కాలనీలో 80 ఇళ్లకు నిప్పు.. భూవివాదంతో తీవ్ర ఉద్రిక్తత
దీంతో రెస్క్యూ చేసిన వెంటనే అనిల్, దేవేంద్రలను ఆస్పత్రిలో చేర్పించారు. ఇద్దరు కూడా బాగానే ఉన్నారని వైద్యులు వెల్లడించారు. నాలుగు అడుగులమేర పేరుకుపోయిన మంచులో మూడు రోజుల పాటు ఉండటం వల్ల వారు కొంత అస్వస్థతకు గురయ్యారని చెప్పారు. దీంతో ఆ ఇద్దరు సైనికుల కుటుంబాలు ఊపిరిపీల్చుకున్నాయి.