Sitaram Yechury Condition Critical : సీపీఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోగ్యం విషమంగా ఉంది. దీంతో ఆయనకు ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు వెంటిలేటర్ అమర్చారు. ఏడుగురు ఎయిమ్స్ వైద్య నిపుణుల బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోంది. ఈమేరకు వివరాలతో సీపీఎం పార్టీ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది.
Also Read :Dubai Princess Divorce Perfume: భర్తకు ‘డైవర్స్’.. ‘డైవర్స్ పర్ఫ్యూమ్’ రిలీజ్ చేసిన యువరాణి
సీతారాం ఏచూరి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో ఆగస్టు 19వ తేదీన ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరారు. అప్పటి నుంచి ఆయనకు వైద్య నిపుణులు చికిత్స అందిస్తున్నారు. ఈక్రమంలో గత గురువారం రోజు సీతారాం ఏచూరి ఆరోగ్యం తీవ్రంగా క్షీణించింది. ఇవాళ మరోసారి ఆయన ఆరోగ్యం విషమించింది. సీతారాం ఏచూరి(Sitaram Yechury Condition Critical) త్వరగా కోలుకోవాలని తాము కోరుకుంటున్నట్లు సీపీఎం పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
సీతారాం ఏచూరి గురించి..
- సీతారాం ఏచూరి 1952 ఆగస్టు 12న చెన్నైలో తెలుగు మాట్లాడే కుటుంబంలో జన్మించారు.
- ఆయన ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్ కళాశాలలో డిగ్రీ చేశారు.
- 1975లో ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్‌యూ)లో ఎంఏ ఆర్థికశాస్త్రం కోర్సు చేశారు. అక్కడే పీహెచ్‌డీలో చేరారు. అయితే ఆ కోర్సును పూర్తి చేయలేకపోయారు.
- 1974లో స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్ఎఫ్ఐ)లో విద్యార్థి నాయకుడిగా చేరారు.
- దేశంలో అత్యవసర పరిస్థితి ఎత్తివేసిన తర్వాత జేఎన్‌యూ విద్యార్థి నాయకుడిగా మూడుసార్లు ఎన్నికయ్యారు.
- 1978లో అఖిల భారత ఎస్‌ఎఫ్‌ఐ సంయుక్త కార్యదర్శిగా నియమితులయ్యారు. అనంతరం అధ్యక్షుడయ్యారు.
- 1986లో ఎస్ఎఫ్ఐని వదిలి పూర్తి రాజకీయాలపై దృష్టిపెట్టారు.
- 1984లో ఆయనను పార్టీలోకి సీపీఎం ఆహ్వానించింది.
- 1985లో జరిగిన సీపీఎం పన్నెండో సీపీఎం జాతీయ మహా సభల్లో కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు.
- 2005లో పశ్చిమబెంగాల్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు.
- 2015 విశాఖపట్నంలో జరిగిన 21 జాతీయ మహాసభలో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు.