Sirens : భారత్ మరియు పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరోసారి తీవ్రమవుతున్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో పాక్ దాడుల ముప్పు పెరుగుతుండటంతో భద్రతా యంత్రాంగం పూర్తి అప్రమత్తత పాటిస్తోంది. ఈ నేపథ్యంలో పంజాబ్‌లోని చండీగఢ్ నగరంలో శుక్రవారం ఉదయం ఆరంభం నుంచే సైరన్ల శబ్దం ఆ ప్రాంత ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. పాకిస్థాన్ వైపు నుంచి ఏవైనా వైమానిక దాడులు జరిగే అవకాశం ఉందన్న ఆందోళనతో చండీగఢ్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ ముందస్తు హెచ్చరిక జారీ చేసింది. ప్రజలు ఇంట్లోనే ఉండాలని, అవసరం లేకపోతే బయటకు రావద్దని అధికారులు సూచించారు. మరింత జాగ్రత్తగా ఉండేందుకు, బహిరంగ ప్రదేశాల్లో సంచరించకూడదని, బాల్కనీల్లోకి కూడా రావొద్దని స్పష్టం చేశారు.
Read Also: Death People: చనిపోయిన వారి ఫోటోలను ఇంట్లో పెట్టుకొని పూజ చేయవచ్చా.. పండితులు ఏం చెబుతున్నారంటే!
అటు జమ్మూ నగరంలోనూ శుక్రవారం తెల్లవారుజామున 4.15 గంటల ప్రాంతంలో సైరన్లు మోగాయి. అంతేకాకుండా పేలుడు శబ్దాలు వినిపించాయని స్థానికులు తెలిపారు. తక్షణమే నగరాన్ని బ్లాక్‌అవుట్ చేయడంతో రహదారులు వెలుతురు లేక ఖాళీగా కనిపించాయి. ఇక, సరిహద్దుల్లో పాక్ తరఫున వస్తున్న డ్రోన్లను భారత భద్రతా బలగాలు సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాయి. రాజస్థాన్‌లోని జైసల్మేర్ సమీపంలోని ఓ హోటల్ ప్రాంగణంలో పాక్‌కు చెందిన డ్రోన్ శకలాలు గుర్తించబడ్డాయి. ఈ డ్రోన్ శుక్రవారం తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో బీఎస్‌ఎఫ్ క్యాంప్‌ను లక్ష్యంగా పంపినట్లు సమాచారం. భద్రతా బలగాలు వెంటనే స్పందించి డ్రోన్‌ను కూల్చివేశాయి. శకలాలను అధికారులు పరిశీలిస్తున్నారు.
ప్రస్తుత పరిణామాలు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రంగా మారే సూచనలుగా మారాయి. సరిహద్దు జిల్లాల్లో భద్రతా ఏర్పాట్లు కఠినంగా కొనసాగుతున్నాయి. పాక్ నుంచి ఏదైనా అక్రమ చొరబాటును ముందుగానే గుర్తించి తిప్పికొట్టేలా భారత బలగాలు ప్రయత్నిస్తున్నాయి.