Shyam Rangeela : శ్యామ్ రంగీలా.. ప్రముఖ హాస్యటుడు. నార్త్ ఇండియాలో ఈయన చాలా ఫేమస్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, బిహార్ సీఎం నితీశ్ కుమార్ వంటి అగ్రనేతల గొంతులను అనుకరించి మిమిక్రీ చేయడంలో శ్యామ్ రంగీలా దిట్ట. తాజాగా ఆయన సంచలన ప్రకటన చేశారు. వారణాసి లోక్‌సభ స్థానం నుంచి ప్రధాని మోడీపై పోటీ చేస్తానని శ్యామ్ అనౌన్స్ చేశారు. ఈ ప్రకటన తర్వాత తనకు లభిస్తున్న జనాదరణను చూసి ఎంతో సంతోషిస్తున్నానని ఆయన చెప్పారు. ‘‘నేను వారణాసి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తాను. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరినీ నమ్మే పరిస్థితి లేదు. ఎవరైనా ఎప్పుడైనా నామినేషన్‌ను ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది’’ అని పేర్కొంటూ శ్యామ్ రంగీలా ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. వారణాసిలో పర్యటన, నామినేషన్ దాఖలు కార్యక్రమం, ఎన్నికల్లో పోటీ గురించి పూర్తి వివరాలతో త్వరలోనే ఓ వీడియోను విడుదల చేస్తానని ఆయన వెల్లడించారు.
We’re now on WhatsApp. Click to Join
తాజాగా మీడియాతో మాట్లాడిన శ్యామ్ రంగీలా(Shyam Rangeela) కీలక వ్యాఖ్యలు చేశారు.. ‘‘2014 లోక్‌సభ ఎన్నికల టైంలో నేను ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అనుచరుడిగా ఉన్నాను. అప్పట్లో ఆయనకు మద్దతుగా చాలా వీడియోలను చేశారు. ఆనాడు రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్‌లకు వ్యతిరేకంగా వీడియోలు షేర్ చేశాను. ఆ వీడియోలను చూస్తే.. నేను వచ్చే 70 ఏళ్ల పాటు బీజేపీకి మాత్రమే ఓటేస్తానని అనుకుంటారు. కానీ గత 10 ఏళ్లలో పరిస్థితి మారింది. నేను వారణాసిలో ప్రధాని మోడీపై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. గుజరాత్‌లోని సూరత్, మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ లోక్‌సభ స్థానాలలా కాకుండా.. వారణాసి ప్రజలకు కచ్చితంగా నా రూపంలో ఒక నిలకడతో కూడిన అభ్యర్థిత్వం లభిస్తుంది. ఈ వారంలోనే నేను వారణాసికి వెళ్లి నామినేషన్ వేస్తాను’’ అని శ్యామ్ రంగీలా చెప్పారు. వారణాసి లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జూన్ 1న జరగనుంది.
శ్యామ్ రంగీలా గురించి తెలుసా ?
- శ్యామ్ రంగీలా అసలు పేరు శ్యామ్ సుందర్. ఈయన 1994లో రాజస్థాన్‌లోని హనుమాన్‌ఘర్ జిల్లా మనక్తేరి బరానీ గ్రామంలో జన్మించారు.
- ఈయన తొలుత యానిమేషన్ కోర్సు చేశారు.
- శ్యామ్‌కు కామెడీ చేయడం అంటే చాలా ఇష్టం. అందుకే మిమిక్రీ, స్టాండ్-అప్ కామెడీ షోలు చేసే దిశగా అడుగులు వేశారు.
- 2017 సంవత్సరంలో ‘ది గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్’ వేదికపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అనుకరిస్తూ చేసిన మిమిక్రీ వల్ల శ్యామ్ ఫేమస్ అయ్యారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి ఆయన ఓవర్‌నైట్ స్టార్‌గా మారారు.
- 2022లో శ్యామ్ రంగీలా రాజస్థాన్‌లోని ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు.