Site icon HashtagU Telugu

ISRO : అంతరిక్షంలో అరుదైన ఘనత సాధించిన శుభాంశు శుక్లా

Shubhanshu Shukla

Shubhanshu Shukla

ISRO : అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) లో 18 రోజుల పాటు కొనసాగిన ప్రయాణం అనంతరం భారత వైమానిక దళ అధికారి గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా సురక్షితంగా భూమిపైకి తిరిగి వచ్చారు. స్పేస్ ఎక్స్ రూపొందించిన డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్ “గ్రేస్” ద్వారా అమెరికా, పోలాండ్, హంగేరీకి చెందిన ముగ్గురు అంతరిక్షయాత్రికులతో కలిసి శుక్లా కూడా ప్రయాణించారు. ఈ డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్ మంగళవారం భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:01 గంటలకు కాలిఫోర్నియా తీరానికి సమీపంగా పసిఫిక్ మహాసముద్రంలో సురక్షితంగా ల్యాండ్ అయింది.

ఈ సందర్భంగా ఇస్రో (ISRO) స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ డైరెక్టర్ నీలేష్ డెసాయ్ మాట్లాడుతూ… “ISSలో శుభాంశు శుక్లా పొందిన అనుభవం, వచ్చే రెండేళ్లలో చేపట్టే గగనయాన్ మానవ అంతరిక్ష యాత్రకు ఎంతగానో దోహదం చేస్తుంది” అని తెలిపారు.

భారత్‌కి స్థిర స్థానం

ఈ విజయం ద్వారా అంతరిక్ష రంగంలో భారత్ తన స్థిరస్థానాన్ని చాటుకుందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. “ఇది భారతదేశం కోసం మాత్రమే కాకుండా, ప్రపంచం కోసం సైతం గర్వకారణమైన ఘట్టం” అని వ్యాఖ్యానించారు.

జూన్ 26న అంతరిక్షానికి బయలుదేరిన శుభాంశు శుక్లా, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించారు. 1984లో రాకేష్ శర్మ తర్వాత అంతరిక్షానికి వెళ్లిన రెండో భారతీయుడిగా గుర్తింపు పొందారు.

రాజకీయ నేతల అభినందనలు

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. “శుభాంశు శుక్లా విజయవంతంగా తిరిగి వచ్చారన్నది ప్రతి భారతీయునికీ గర్వకారణం. ఇది వ్యక్తిగత విజయంతో పాటు, భారతదేశం అంతరిక్ష ఆశయాలను పైకెత్తే ఘట్టం” అన్నారు.

ఇందుకు తోడు, పెట్రోలియం శాఖ మంత్రి హరదీప్ సింగ్ పూరీ కూడా శుక్లాను అభినందిస్తూ… “ఈ 18 రోజుల ప్రయాణం భారత్ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన అంతరిక్ష యాత్రలకి మార్గం సుగమం చేస్తుంది. భవిష్యత్‌లో చంద్రుడి వరకు భారతీయుల ప్రయాణాన్ని ఇది ప్రేరేపించనుంది” అన్నారు.

కుటుంబ సభ్యుల గర్వానుభూతి

శుక్లా తండ్రి శంభూ దయాల్ శుక్లా మాట్లాడుతూ… “నా కుమారుడు అంతరిక్ష ప్రయాణం చేయగలిగినందుకు గర్వంగా ఉంది. ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ప్రోత్సాహంతోనే సాధ్యమైంది” అన్నారు.

గణనీయమైన ప్రయాణం.. విశేషాలు

శుక్లా తన 18 రోజుల ISS ప్రయాణంలో 310 పైగా కక్ష్యల చుట్టూ భూమిని పర్యటించి, మొత్తం 1.3 కోట్ల కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించారు. ఇది భూమి నుంచి చంద్రుడి వరకు 33 సార్లు ప్రయాణించిన దూరానికి సమానం. అంతేకాక, 300 పైగా సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు కూడా చూసారు.

ప్రస్తుతం శుక్లా సహా మిగతా అంతరిక్షయాత్రికులు భూమి గురుత్వాకర్షణకు తిరిగి అలవాటు పడేందుకు వైద్య బృందాల పర్యవేక్షణలో ప్రత్యేక రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్‌ (సుమారు 7 రోజులు) లో పాల్గొననున్నారు.

Harry Potter Reboot : హ్యారీ పాటర్ మరోసారి తెరపైకి.. కొత్త హీరోతో HBO Max రీబూట్