Pakistani Spies : పాకిస్తాన్ గూఢచారిగా మారడం అంటే మన దేశానికి ద్రోహం చేయడమే. పాక్ గూఢచారులుగా మారి భారత్‌కు ద్రోహం చేసిన ఎంతోమందిని గత కొన్ని వారాల్లో పోలీసులు, భారత దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. వీరిలో ఎక్కువ మంది హర్యానా రాష్ట్రవాసులే ఉండటం గమనార్హం. దీంతో హర్యానా రాష్ట్ర ప్రజలను హనీ ట్రాప్‌లో వేసుకునేందుకు పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ ఏదైనా స్పెషల్ సైబర్ ఆపరేషన్‌ను నడుపుతోందా అనే సందేహాలు రేకెత్తుతున్నాయి.
Also Read :Sofiya Qureshi : ‘ఆపరేషన్ సిందూర్’పై వ్యాఖ్యలు.. అలీఖాన్ అరెస్ట్.. విజయ్ షాకు మినహాయింపు
యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా
హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్(Pakistani Spies) కోసం గూఢచర్యం చేస్తూ గతవారమే అరెస్టయింది. ఆమె ట్రావెల్ విత్ జో (Travel With Jo) పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తోంది. ఏప్రిల్ 22న జమ్మూకశ్మీరులోని పహల్గాంలో ఉగ్రదాడి జరిగింది. దీనికి సరిగ్గా మూడు నెలల ముందే.. ఆమె పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన ప్రాంతానికి వెళ్లి వీడియోలు తీసినట్లు గుర్తించారు. ఆ వీడియోలను పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లకు పంపి ఉండొచ్చని భావిస్తున్నారు. పహల్గాం ఉగ్రదాడికి ముందు జ్యోతి పలుమార్లు పాక్, చైనాలలో పర్యటించినట్లు తెలిసింది. 2023లో పాక్‌కు వెళ్లినటైంలో ఆమెకు డానిష్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. అతడు ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ ఉద్యోగి. డానిష్‌తో జ్యోతికి సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. అలీ అహ్సాన్ అనే వ్యక్తిని జ్యోతి కలవగా.. అతడు పాక్ నిఘా, రక్షణ విభాగాలకు చెందిన వ్యక్తులను జ్యోతికి పరిచయం చేశాడట.
Also Read :Monica Bedi : మోనికా బేడీకి నకిలీ పాస్‌పోర్ట్.. కృష్ణమోహన్‌రెడ్డి, పీఎస్‌ఆర్ ఆంజనేయులు హయాంలోనే!
ప్రియాంక సేనాపతితో కలిసి శ్రీక్షేత్రానికి జ్యోతి.. ఎందుకు ?
జ్యోతి మల్హోత్రాకు ఒడిశాలోని పూరీకి చెందిన ప్రియాంక సేనాపతితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. 2024 సెప్టెంబరు 26న పూరీకి వెళ్లిన జ్యోతి, ఇక్కడి శ్రీక్షేత్రాన్ని సందర్శించింది. శ్రీక్షేత్రంపై ఉగ్రవాదుల కళ్లున్నాయని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం ఉంది. ఈ పరిస్థితిలో జ్యోతి జగన్నాథస్వామి దర్శనానికి వచ్చారా? లేక రెక్కీ చేసి, పాక్‌కు ఏదైనా సమాచారం అందించారా? అనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రియాంక ఏమంటోంది ?
ప్రియాంక 3 నెలల క్రితం పాకిస్తాన్‌లోని కర్తార్‌పూర్‌ను సందర్శించింది. దీనిపై సోషల్ మీడియా వేదికగా ప్రియాంక ఆదివారం వివరణ ఇచ్చింది. జ్యోతి మల్హోత్రా పాక్ గూఢచారిణి అని తనకు తెలియదని తేల్చి చెప్పింది. తాను విహారయాత్ర కోసమే పాక్‌కు వెళ్లానని ప్రియాంక పేర్కొంది.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌పై జ్యోతి వీడియో
సికింద్రాబాద్‌లో వందే భారత్ రైలు ప్రారంభోత్సవంపై జ్యోతి చేసిన వీడియో ఒకటి తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆమె సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను చూపించింది. మొత్తం మీద యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా గూఢచర్యం కేసులో జ్యోతి సహా మొత్తం ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరంతా పాకిస్తాన్ నిఘా వర్గాలతో నిరంతరం రహస్య సమాచారం పంచుకుంటున్నారని తేలింది. ఇందుకోసం వీరు ఎన్క్రిప్టెడ్ అప్లికేషన్లను వినియోగించినట్లు గుర్తించారు.
అరెస్టయిన మిగతా నలుగురు..
- పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేస్తూ ఇటీవలే పోలీసులకు దొరికిపోయిన వారిలో.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యాపారి షెహజాద్, గార్డ్‌గా పనిచేస్తున్న నౌమాన్ ఇలాహీ ఉన్నారు. నౌమాన్ ఇలాహీ హర్యానాలోని పానీపట్‌లో గార్డ్‌గా పనిచేస్తున్నాడు.
- హర్యానాలోని కైథాల్‌కు చెందిన దేవేందర్ సింగ్ ధిల్లాన్, అదే రాష్ట్రంలోని నూహ్ పరిధిలో ఉండే రాజక గ్రామానికి చెందిన అర్మాన్‌లను పోలీసులు అరెస్టు చేశారు.
- వీరంతా పాక్ కోసం భారత్‌లో గూఢచర్యం చేస్తున్నారనే అభియోగాలు ఉన్నాయి.