Dalai Lama : చైనాకు షాక్ ఇచ్చే కీలక పరిణామం భారత్‌లో చోటుచేసుకుంది. హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాలలో ఉన్న టిబెట్ ప్రవాస ప్రభుత్వాధినేత దలైలామాతో అత్యున్నతస్థాయి అమెరికా కాంగ్రెస్ బృందం భేటీ అయింది. అమెరికా ప్రతినిధుల సభ మాజీ స్పీకర్ నాన్సీ పెలోసీ సారథ్యంలోని టీమ్ దలైలామాను కలిసింది. ఆయనతో భేటీ అయిన ప్రముఖుల్లో అమెరికా కాంగ్రెస్ ఫారిన్ అఫైర్స్ కమిటీ ఛైర్మన్ మిషెల్ మెక్‌కౌల్‌తో పాటు డెమొక్రటిక్, రిపబ్లికన్ పార్టీల సభ్యులు ఉన్నారు.
We’re now on WhatsApp. Click to Join
అమెరికా ప్రతినిధులు దలైలామాతో భేటీ కావడంపై చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. 14వ దలైలామా కేవలం ఆధ్యాత్మిక వ్యక్తి మాత్రమేనని, టిబెట్ ప్రభుత్వంతో ఆయనకు సంబంధం లేదని స్పష్టం చేసింది. చైనా వ్యతిరేక వేర్పాటువాద కార్యకలాపాలను మతం ముసుగులో అమెరికా ప్రోత్సహిస్తోందని చైనా మండిపడింది. గతంలో షిజియాంగ్ (టిబెట్) విషయంలో తమకు ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉండాలని అమెరికాను చైనా డిమాండ్ చేసింది. దలైలామాతో సంబంధాలు పెట్టుకోవద్దని వార్నింగ్ ఇచ్చింది. ‘‘టిబెట్ చైనాలో పూర్తిగా ఓ అంతర్భాగం. దాన్ని కాపాడుకోవడానికి బలమైన చర్యలు తీసుకుంటాం’’ అని చైనా తెలిపింది. ఈమేరకు చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ ఓ ప్రకటన విడుదల చేశారు.
Also Read : Union Budget 2024 : కేంద్ర బడ్జెట్‌లో వేతన జీవుల కోసం గుడ్ న్యూస్ !
గతంలో అమెరికా ప్రతినిధుల సభ మాజీ స్పీకర్ నాన్సీ పెలోసీ పర్యటనకు రక్షణగా అమెరికా వాయుసేనే రంగంలోకి దిగాల్సి వచ్చింది. అప్పట్లో హౌస్ స్పీకర్ హోదాలో నాన్సీ పెలోసీ తైవాన్ విషయంలో చైనాను లెక్క చేయలేదు. అప్పట్లో ఆమె తైపీ పర్యటన అమెరికా-చైనా మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. పెలోసీ పర్యటనకు వెళ్లిన విమానానికి అమెరికా ఫైటర్ జెట్లు రక్షణగా వెళ్లాల్సి వచ్చింది. ఆమె పర్యటన అనంతరం చైనా భారీఎత్తున యుద్ధ విన్యాసాలు నిర్వహించింది. ఇప్పుడు భారత్ వేదికగా దలైలామాతో భేటీ కావడం ద్వారా మరోసారి చైనాకు ఆమె షాక్ ఇచ్చారు. అయితే భారత్ కేంద్రంగా ఇలాంటి సమావేశాలు జరగడం అనేది చైనాతో సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరిగేందుకు దారితీయొచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దలైలామాను(Dalai Lama) నేరుగా వాషింగ్టన్‌కు పిలిపించుకొని అమెరికా చర్చలు జరిపితే బాగుండేదని విదేశాంగ వ్యవహారాల నిపుణులు అభిప్రాయపడుతున్నారు.