Congress : కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ మరోసారి సొంత పార్టీ పై వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ఈసారి ఆయన విమర్శలు ఎదుర్కొంటున్న కారణం నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదంపై తీసుకుంటున్న ద్రుత చర్యలను ప్రశంసించడమే. ఇటీవల కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి అనంతరం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రచార కార్యక్రమంలో భాగంగా థరూర్ భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తున్నారు. పనామాలో జరిగిన ఓ అంతర్జాతీయ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, భారత్‌ను లక్ష్యంగా చేసుకునే ఉగ్రవాద సంస్థలు ఇప్పుడు తీవ్ర మూల్యాన్ని చెల్లించాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు. “యూరీ దాడి తర్వాత నియంత్రణ రేఖ దాటి సర్జికల్ స్ట్రైక్స్ చేశాం. పుల్వామా దాడి తర్వాత బాలాకోట్‌లో ఉగ్ర స్థావరాలపై దాడులు జరిగాయి. తాజాగా పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రాంతంలో తొమ్మిది ఉగ్ర శిబిరాలపై కేంద్రమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దాడులు జరిగినట్లు తెలిసింది,” అని ఆయన తెలిపారు.
Read Also: Fish Prasadam : జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ.. మృగశిర కార్తె రోజే తినాలా ?
ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలవరం కలిగించాయి. కాంగ్రెస్ నేతలు థరూర్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. మాజీ ఎంపీ ఉదిత్ రాజ్, “థరూర్ ఇప్పుడు బీజేపీకి అనుకూలంగా మాట్లాడుతున్నారు. ఆయన మోడీని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు,” అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా, సీనియర్ నేత జైరాం రమేష్‌లు కూడా సామాజిక మాధ్యమాల్లో థరూర్‌పై విమర్శలు గుప్పించారు. యూపీఏ హయాంలోనూ పలు సర్జికల్ దాడులు జరిగాయని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన వ్యాఖ్యల వీడియోను ఖేరా షేర్ చేశారు.
ఈ నేపథ్యంలో థరూర్ గురువారం ‘ఎక్స్’ ద్వారా స్పందించారు. “పనామాలోని కార్యక్రమాలు ముగించుకుని, బొగోటాకు ప్రయాణించాల్సి ఉంది. ఈ సమయంలో కొందరు నా వ్యాఖ్యలను వక్రీకరించి నిందలు వేస్తున్నారు. నేను ప్రస్తుత ఉగ్రవాద దాడులపై ప్రభుత్వ ప్రతిచర్యల గురించి మాట్లాడాను తప్ప, రాజకీయ శ్రేయస్సు కోసం కాదు. నా మాటలను తప్పుగా అర్థం చేసుకుంటున్నవారికి చెప్పేదేంటంటే నాకు వాటిపై స్పందించే సమయం లేదు. ఇంతకంటే ముఖ్యమైన పనులున్నాయి,” అని ఆయన స్పష్టం చేశారు. థరూర్ వ్యాఖ్యలు కాంగ్రెస్ నేతల్లో కల్లోలాన్ని రేపినప్పటికీ, మౌలికంగా ఆయన ఉగ్రవాదంపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సమర్థిస్తూ మాట్లాడినట్లు తెలుస్తోంది. అయితే పార్టీలో అంతర్గత ఏకాభిప్రాయం లోపించడంతో ఈ వ్యాఖ్యలు రాజకీయంగా వివాదాస్పదంగా మారాయి.