Neet Row : డీఎంకే ప్రభుత్వానికి వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్ పరీక్ష విషయంలో ఎదురు దెబ్బ తగిలింది. నీట్ పరీక్ష నుంచి తమ రాష్ట్రాన్ని మినహాయించాలని తమిళనాడు చేసిన అభ్యర్థనను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరస్కరించారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర శాసనసభలో ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రకటించారు. దీనిపై కేంద్రం, డీఎంకే ప్రభుత్వం మధ్య వివాదం కొనసాగుతోంది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేసేందుకు న్యాయపరమైన మార్గాలను అన్వేషిస్తాం. న్యాయ నిపుణులను సంప్రదిస్తాం అని స్టాలిన్ అసెంబ్లీలో తెలిపారు. దీనిపై సమగ్రంగా చర్చించేందుకు ఏప్రిల్ 9న అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు.
Read Also: First Bird Flu Death In AP: ఏపీలో తొలి బర్డ్‌ఫ్లూ మరణం..
తమిళనాడు సర్కారు ఈ విషయంపై అన్ని వివరణలు ఇచ్చినప్పటికీ.. నీట్ నుంచి మన రాష్ట్రాన్ని మినహాయించేందుకు కేంద్రం తిరస్కరిస్తోంది. ఇది దక్షిణాది రాష్ట్రాన్ని అవమానించడమే. అయితే, వారు (కేంద్రం) మన అభ్యర్థనను తిరస్కరించొచ్చు కానీ.. మన పోరాటాన్ని ఆపలేరు అని స్టాలిన్ అన్నారు. ఈ బిల్లును ఇప్పటికే 2021, 2022లో రెండుసార్లు తమిళనాడు అసెంబ్లీ ఆమోదించింది. అనంతరం గవర్నర్‌కు పంపగా.. పలుమార్లు తిరస్కరణకు గురైంది. దీంతో బిల్లులో కొన్ని మార్పులు చేసి రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించారు.
తమిళనాడులో విద్యార్థులు నీట్ పరీక్ష కారణంగా ఆత్మహత్యలు పెరుగుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తంచేస్తోంది. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం జాతీయస్థాయిలో నిర్వహించే అర్హత పరీక్ష నీట్ పరిధి నుంచి తమిళనాడును శాశ్వతంగా మినహాయించాలంటూ అక్కడి ప్రభుత్వం ఓ బిల్లును తీసుకొచ్చింది. దీని ప్రకారం.. 12వ తరగతి మార్కుల ఆధారంగా విద్యార్థులకు వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలు కల్పించాలని నిర్ణయించారు. ఇక, ఇప్పటికే హిందీ వివాదం, డీలిమిటేషన్ వంటి అంశాలపై కేంద్రం, తమిళనాడు సర్కారు మధ్య వివాదం కొనసాగుతోంది. తాజాగా నీట్ బిల్లును తిరస్కరించడంతో ఇది మరింత ముదిరేలా కన్పిస్తోంది. వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ పరిణామాలు ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి.
Read Also: Congress : వక్ఫ్ సవరణ బిల్లు పై తాము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం: జైరాం రమేశ్