India Vs Pak : కశ్మీరులోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని భారత్ తీవ్రంగా పరిగణిస్తోంది. అందుకే పాకిస్తాన్‌పై కొరడా ఝుళిపిస్తోంది. ఈక్రమంలోనే ఢిల్లీలో ఉన్న పాకిస్తాన్ హైకమిషన్ కార్యాలయం వద్ద భద్రతను తగ్గించింది. ఆ ఆఫీసు వద్దనున్న బారికేడ్లను తీసి వేయించింది. దీంతో ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ కార్యాలయానికి సెక్యూరిటీ తగ్గిపోయింది. తద్వారా భారత్ తన నిరసనను బహిరంగంగా తెలియజేసింది. అంతేకాదు ఢిల్లీలో ఉన్న పాకిస్తాన్ అత్యున్నత స్థాయి దౌత్యవేత్త సాద్ అహ్మద్ వరాయిచ్‌కు సమన్లు ఇచ్చి, బుధవారం రాత్రి భారత విదేశాంగ శాఖ పిలిపించి మాట్లాడింది. పాకిస్తాన్ సైనిక దౌత్యవేత్తలకు అధికారిక పర్సనాలిటీ నాన్ గ్రాటా నోట్‌ను అందజేసింది.
Also Read :Operation Karre Guttalu: హెలికాప్టర్ల చక్కర్లు.. కాల్పుల శబ్దాలు.. బాంబు పేలుళ్లు.. ఆపరేషన్ కర్రెగుట్ట
ఇకపై సైనిక స్థాయిలోనూ భారత్‌తో పాకిస్తాన్(India Vs Pak) సంప్రదింపులు జరపకుండా చేసేదే నాన్ గ్రాటా నోట్. పాకిస్తాన్ ఆర్మీ, నౌకాదళం, వైమానిక దళం సలహాదారులను బహిష్కరించింది. భారత్ విడిచి వెళ్లిపోవడానికి వారికి ఒక వారం సమయం ఇచ్చింది. పహల్గామ్‌లో జరిగిన క్రూరమైన ఉగ్రవాద దాడికి ప్రతిగా భారతదేశం బలమైన దౌత్య ప్రతీకారం తీర్చుకుంది. బుధవారం సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన భద్రతా కేబినెట్ కమిటీ (CCS) సమావేశంలో పాకిస్తాన్ సరిహద్దు ఉగ్రవాదానికి ప్రతిస్పందనగా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు.
Also Read :Telangana Tourists: కాశ్మీర్‌లో 80 మంది తెలంగాణ పర్యాటకులు.. హెల్ప్‌లైన్ నంబర్లు ప్రకటించిన ప్రభుత్వం!
పాకిస్తాన్‌తో దౌత్య సంబంధాలను తగ్గించడం, కీలక సరిహద్దు మార్గాలను మూసివేయడం, సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం, న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ నుంచి పాకిస్తాన్ సైనిక అధికారులను బహిష్కరించడం వంటి నిర్ణయాలను మోడీ తీసుకున్నారు. సార్క్ వీసా మినహాయింపు పథకం (SVES) కింద పాకిస్తాన్ జాతీయులను భారతదేశంలోకి రావడానికి అనుమతించబోమని కేంద్ర సర్కారు ప్రకటించింది. 2019 పుల్వామా ఉగ్రదాడి తర్వాత కశ్మీరు లోయలో జరిగిన అత్యంత దారుణమైన ఉగ్రదాడి ఇదే. అందుకే భారత సర్కారు అంత సీరియస్‌గా స్పందించింది.