Arvind Kejriwal : లిక్కర్ స్కాం కేసులో నిందితుడిగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్‌ను ఢిల్లీ సీఎం పదవి నుంచి తొలగించాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది. ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ తెలిపింది. ఒకవేళ అవసరమైన పరిస్థితుల్లో ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ మాత్రమే దీనిపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ పిటిషన్‌కు చట్టపరమైన అర్హత లేదని దేశసర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది.
We’re now on WhatsApp. Click to Join
లిక్కర్ స్కాం కేసులో మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆయన జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్ పై ఉన్నారు. జూన్ 2వ తేదీన తిహార్ జైలుకు కేజ్రీవాల్(Arvind Kejriwal) తిరిగి వెళ్తారు. అరెస్టయినప్పటికీ సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేయలేదంటూ సందీప్ కుమార్ అనే వ్యక్తి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీన్ని హైకోర్టు అప్పట్లో తిరస్కరించింది. ఈ పిటిషన్ పనికి మాలిందని వ్యాఖ్యానించిన హైకోర్టు.. దాన్ని వేసినందుకు పిటిషనర్‌పై 50వేల రూపాయల జరిమానా విధించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సదరు పిటిషనర్ సుప్రీంకోర్టు తలుపుతట్టారు. అయితే సుప్రీంకోర్టులోనూ అదే విధమైన తీర్పు వచ్చింది. హైకోర్టు నిర్ణయాన్నే సుప్రీంకోర్టు బెంచ్ సమర్థించింది. కేజ్రీవాల్‌ను సీఎం పదవి నుంచి తప్పించడనికి తమకు చట్టపరమైన హక్కులు లేవని తేల్చి చెప్పింది. అలాంటి నిర్ణయం తీసుకునే అధికారం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు మాత్రమే ఉందని స్పష్టం చేసింది. సందీప్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తోసిపుచ్చింది.
Also Read :Swati Maliwal : ఆప్ ఎంపీ స్వాతి మలివాల్‌పై కేజ్రీవాల్ పీఏ దాడి ? పోలీసులకు కాల్స్!
ఇటీవల ఎన్నికల ప్రచారం చేస్తూ అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. “పోలింగ్ సమయంలో ప్రచారం చేసుకునేందుకు నేను జైలు నుంచి బయటకు వచ్చాను. ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత..జూన్ 1న నేను మళ్లీజైలుకు వెళ్లాలి. నేను జైలుకు వెళ్లకుండా ఉండాలంటే.. మీరే నన్ను కాపాడాలి“ అని ఆయన పిలుపునిచ్చారు. ఐదో దశలో ఢిల్లీలో ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ ఏడు పార్లమెంటు స్థానాలకుగానూ మూడు చోట్ల ఆప్ అభ్యర్థులు, మరో నాలుగు స్థానాల్లో కాంగ్రెస్(కూటమి) అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.