Kolkata Doctor : కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో జూనియర్ వైద్యురాలిపై ఆగస్టు 9న జరిగిన హత్యాచార ఘటన యావత్ దేశంలో కలకలం రేపింది. దీనిపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ ఇప్పటివరకు కీలక అంశాలను గుర్తించింది. ప్రధాన నిందితుడిగా ఉన్న సంజయ్ రాయ్‌పై(Kolkata Doctor) చాలా ప్రశ్నలు సంధించింది. అతడికి సైకో అనాలిసిస్ టెస్టు, లై డిటెక్టర్ (పాలీగ్రాఫ్) టెస్టు కూడా నిర్వహించి కేసుతో ముడిపడిన ముఖ్యమైన అంశాలపై సమాధానాలను రాబట్టారు. సంజయ్ రాయ్ తరఫు న్యాయవాది కవితా సర్కార్ వాదన మరోలా ఉంది. సంజయ్ నిర్దోషి అని, అతడిని దురుద్దేశంతో ఈ కేసులో ఇరికిస్తున్నారని ఆమె అంటున్నారు. లై డిటెక్టర్ పరీక్షలోనూ తాను నిర్దోషిని అని సంజయ్ చెప్పారని కవితా సర్కార్ పేర్కొన్నారు.
We’re now on WhatsApp. Click to Join
ఆగస్టు 9న తెల్లవారుజామున ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ సెమినార్ హాలులో జూనియర్ వైద్యురాలిని హత్య చేసిన తర్వాత ఏం చేశావని సీబీఐ అధికారులు ప్రశ్నించగా.. ‘‘నేను హత్యే చేయనప్పుడు, ఆ తర్వాత ఏం చేశానో ఎలా చెప్పాలి’’ అని సంజయ్ రాయ్ బదులిచ్చినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. తాను మెడికల్ కాలేజీ సెమినార్ హాల్‌లోకి ప్రవేశించే సమయానికే జూనియర్ వైద్యురాలు అపస్మారక స్థితిలో ఉందని సంజయ్ రాయ్ చెప్పినట్లు సమాచారం. అప్పటికే ఆమె రక్తపు మడుగులో పడి ఉందని నిందితుడు సంజయ్ రాయ్ సీబీఐ అధికారులకు వివరించినట్లు తెలిసింది. తాను జూనియర్ వైద్యురాలి డెడ్‌బాడీని చూసి భయంతో సెమినార్ హాలు నుంచి బయటకు పరుగెత్తానని అతడు తెలిపాడు. ‘‘నువ్వు ఒకవేళ నిర్దోషివే అయితే.. జూనియర్ వైద్యురాలు చనిపోయిన ఘటనపై పోలీసులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదు ?’’ అని సీబీఐ అధికారులు ప్రశ్నించగా.. ‘‘నేను చెబితే ఎవరూ నమ్మరని భయపడ్డాను’’ అని సంజయ్ రాయ్ బదులిచ్చాడు. జూనియర్ వైద్యురాలిపై ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తి మరెవరైనా అయి ఉండొచ్చన్నాడు. జూనియర్ వైద్యురాలి శరీరంపై లైంగిక వేధింపుల ఆనవాళ్లను గుర్తించారు. శరీరంలో 25 బాహ్య, అంతర్గత గాయాలు ఉన్నాయని వెల్లడైంది.