Samajwadi Vs MVA : మహారాష్ట్రలోని ప్రతిపక్ష పార్టీల కూటమి ‘మహావికాస్ అఘాడీ’ (ఎంవీఏ)కి షాకింగ్ పరిణామం ఎదురైంది. కూటమి నుంచి సమాజ్ వాదీ పార్టీ తప్పుకుంది. 1992 డిసెంబరు 6న ఉత్తరప్రదేశ్‌లో బాబ్రీ మసీదు కూల్చివేత ఘటన జరిగింది. ఈనెల 6వ తేదీతో బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనకు 32 ఏళ్లు పూర్తయ్యాయి. ఈసందర్భంగా ఉద్ధవ్ థాక్రే వర్గం నేత మిలింద్ నర్వేకర్ సోషల్ మీడియా వేదికగా వివాదాస్పద పోస్ట్ పెట్టారు. దీనికి బాలా సాహెబ్ థాక్రే, ఉద్ధవ్ థాక్రే, ఆదిత్య థాక్రే ఫొటోలను జతపరిచారు. ఈ పోస్ట్‌లో చేసిన వ్యాఖ్యలపై సమాజ్‌వాదీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సీరియస్ అయ్యారు. ఇక తాము ఎంవీఏ కూటమిలో కొనసాగేది లేదని ప్రకటించారు. మిలింద్ నర్వేకర్ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు.
Also Read :Mahbubnagar Earthquake : మహబూబ్‌నగర్ జిల్లాలో స్వల్ప భూకంపం.. దాసరిపల్లిలో భూకంప కేంద్రం
మహారాష్ట్ర అసెంబ్లీలో సమాజ్‌వాదీ(Samajwadi Vs MVA) పార్టీకి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రతిపక్ష ఎంవీఏ ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారానికి సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు హాజరుకాలేదు. సమాజ్‌వాదీ పార్టీ మహారాష్ట్ర అధ్యక్షుడు అబూ ఆసిం ఆజ్మీ, ఎస్పీ ఎమ్మెల్యే రయీస్ షేక్‌లు వేరుగా ప్రమాణ స్వీకారం చేశారు. ‘‘బాబ్రీ మసీదును కూల్చేసిన వారిని అభినందిస్తూ ఉద్ధవ్ శివసేన వార్తాపత్రికలో ఒక ప్రకటన ఇచ్చింది. ఈ అంశంపై ఉద్ధవ్ థాక్రే అనుచరుడు నర్వేకర్ సోషల్ మీడియా వేదికగా వివాదాస్పద పోస్ట్ పెట్టారు. బాబ్రీ మసీదును కూల్చిన కరసేవలపై నర్వేకర్ ప్రశంసలు కురిపించారు. అందుకే మేం ఎంవీఏ కూటమి నుంచి వైదొలగుతున్నాం. నేను అఖిలేష్ యాదవ్‌తో మాట్లాడుతున్నాను. ఎంవీఏ కూటమిలో ఉన్నవాళ్లే ఇలా ప్రవర్తిస్తే బీజేపీకి, వారికి మధ్య తేడా ఏముంటుంది ? అలాంటి వాళ్లతో మేం ఎందుకు కలిసి ఉండాలి ?’’ అని సమాజ్‌వాదీ పార్టీ మహారాష్ట్ర అధ్యక్షుడు అబూ ఆసిం ఆజ్మీ పేర్కొన్నారు.